రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి గెలుస్తాడా..? | Andhra Pradesh Elections 2024: Janasena Corporator Mohammed Sadiq Comments On Vamsi Krishna Srinivas Yadav - Sakshi
Sakshi News home page

రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి గెలుస్తాడా..?

Published Tue, Mar 19 2024 12:40 AM

- - Sakshi

వంశీకృష్ణకు టికెట్‌ ఇవ్వొద్దని వేడుకోలు

ఇస్తే ఓటమి ఖాయమంటున్న సాధిక్‌, మూగి శ్రీనివాసరావు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీలో చిచ్చు మొదలైంది. నెమ్మదినెమ్మదిగా అగ్గి రాజుకుంటోంది. నిన్నా మొన్నటి వరకు చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగి జనసేన టికెట్‌ ఆశించిన నాయకులందరూ పటాపంచులవుతున్నారు. మాలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటామన్న వారంతా ప్రెస్‌మీట్లు పెట్టి... ఆ వ్యక్తి ఇక్కడ పనికిరాడు... స్థానికుడినే ఇక్కడి ప్రజలు ఆదరిస్తారు... పక్క నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయి జనసేనలో చేరిన వ్యక్తికి టికెట్‌ ఇస్తే మేము ఎలా పని చేస్తామంటూ నిప్పులు చెరుగుతున్నారు. అధినేత పవన్‌ కల్యాణ్‌ మాటంటే మాకు శిరోధార్యమంటూనే.. మేము కాదని బయటి వ్యక్తికి సీటు ఇస్తే ససేమిరా పనిచేసేది లేదంటున్నారు. ఓడిపోయే వ్యక్తి వంశీకృష్ణకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్‌ ఇవ్వొద్దంటూ పవన్‌ కల్యాణ్‌ను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం విలేకరులతో మాట్లాడారు.

మత్స్యకారులకే టికెటి ఇవ్వాలి..
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వెనుకబడిన మత్స్యకార సామాజికవర్గం నుంచి జనసేన పార్టీకి ఎప్పటి నుంచో సేవలందిస్తూ, ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఆశించానని డాక్టర్‌ మూగి శ్రీనివాసరావు అన్నారు. సీటు తనకు కేటాయించకపోయినా పర్వాలేదు కానీ... విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గానికి సంబంధం లేని, జనసేన పార్టీ కోసం ఒక్క రోజు కూడా కష్టపడని, సర్వేల్లో కూడా గెలవని వ్యక్తికి పార్టీ టికెట్‌ కేటాయిస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. అసలు వంశీకృష్ణ అనే వ్యక్తికి టికెట్‌ ఇవ్వడమేంటో? పార్టీ అధినేత ప్రకటించకపోయినా ప్రకటించినట్టు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టడమేంటో? తెలియడం లేదన్నారు. పక్క నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయిన వ్యక్తికి ఇక్కడ టికెట్‌ ఇస్తే ఎలా?... అధిష్టానం పునరాలోచించకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.


మాట్లాడుతున్న కార్పొరేటర్‌ సాధిక్‌, మత్స్యకార వికాస నాయకుడు మూగి శ్రీనివాస్‌

రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి గెలుస్తాడా..?
ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన కో కన్వీనర్‌, 39వ వార్డు కార్పొరేటర్‌ మహ్మద్‌ సాధిక్‌ మాట్లాడుతూ స్థానికుడిగా జనసేన పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించానన్నారు. స్థానికేతరుడైన వంశీకృష్ణ శ్రీనివాస్‌ తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ అధికారికంగా ఎక్కడా వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేరును ప్రకటించలేదన్నారు. అలా అని పార్టీ మమ్మల్ని పిలిచి ఎక్కడా చెప్పలేదన్నారు. నిజంగా జనసేన పార్టీకి ఆ ఆలోచన ఉంటే 21 సీట్లలో ఒకటి (విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు) కచ్చితంగా ఓడిపోతుందన్నారు.

నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని, కనీసం సామాజిక వర్గం కూడా బలంగా లేని వ్యక్తిని ఇక్కడ పోటీ చేసేందుకు అభ్యర్థిగా ప్రకటించాలనుకోవడం ఆశ్చర్యకరమన్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించే సామాజికవర్గాలకు చెందిన వారిగా ఈ విషయం చెబుతున్నామన్నారు. 2014లో ఇదే వంశీకృష్ణ అతని సామాజిక వర్గం బలంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. 2009లో కూడా అదే తూర్పు నియోజకవర్గం నుంచి ఓడిపోయారని... అక్కడ గెలవని వ్యక్తి ఇక్కడ ఎలా గెలుస్తాడని సాధిక్‌ ప్రశ్నించారు.

Advertisement
Advertisement