
చురుగ్గా బ్రిడ్జి నిర్మాణ పనులు
తాండూరు: పట్టణ పరిధిలోని తాండూరు – కొడంగల్ మార్గంలో చిలుక వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిలువ వాగు ప్రక్షాళణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల క్రితం దాదాపు రూ.16 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి పునర్మిర్మాణ పనులు చేపట్టారు. వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశించడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి పనులు 70శాతం మేర పూర్తయ్యాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే మార్కెండేయ కాలనీ, టీచర్స్ కాలనీ, ఆదర్శనగర్, తులసీ నగర్, సాయిపూర్ కాలనీకు మేలు చేకూరుతుంది. అంతేకాకుండా వాహనాల రాకపోకలకు సులభతరం అవుతుంది. మరో వారం రోజుల వ్యవధిలో బ్రిడ్జి పైనుంచి రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయి వర్షాలు పడకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.