
దెబ్బతిన్న రోడ్లు.. జనం పాట్లు
తాండూరు: మున్సిపల్ పరిధిలోని అంతర్గత రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఆరేళ్ల క్రితం పలు గ్రామాలను తాండూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదు. ఏడేళ్ల క్రితం రూ.33 కోట్లతో పలు రోడ్లను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా పాడయ్యాయి. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 6, 7 వార్డుల్లో మినహా మిగతా వాటిలో పెద్దగా అభివృద్ధి పనులు జరగలేదు. రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఆస్తి పన్ను వసూలు చేసే మున్సిపల్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌టీఆర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలతోపాటు పట్టణ శివారు ప్రాంతాలన్నీ సమస్యలతో కొటుమిట్టాడుతున్నాయి. పలు శివాజీ చౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు వీధి దీపాలు వెలగటం లేదు.