
కారడవిలో ఉరేసుకున్న వ్యక్తి
ఆర్థిక ఇబ్బందులే కారణమని
కుటుంబీకుల ఫిర్యాదు
అనంతగిరి: వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిగుట్ట అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీఐ భీంకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన సంగనమోని నరసింహ పెద్ద కుమారుడైన రమేశ్(27) ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కాగా గత నెల 29న రాత్రి పని నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రమేశ్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం గుడిమల్కాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమేశ్ ఫోన్ లొకేషన్ అనంతగిరిగుట్ట ప్రాంతంలో చూపించింది. దీంతో తెల్లవారుజామునుంచి వెతుకుతుండగా అతని స్కూటీ వ్యూ పాయింట్ దగ్గర పార్క్ చేసి ఉండటంతో పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో ఓ చెట్టుకు ఉరేసుకున్న ఆయన మృతదేహం లభ్యమయింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ఓ పాప ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పెద్దచెరువులో
మట్టి తవ్వకాలు!
మీర్‌పేట: పెద్దచెరువు (ఐల్యాండ్)లో నిబంధనలకు విరుద్ధంగా బుధవారం ఉదయం మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా.. మాకేం సంబంధం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చెరువు కట్టపై మొక్కలు నాటేందుకు.. కొద్దిగా మట్టి తీసుకెళ్తున్నామని అక్కడే ఉన్న కాంట్రాక్టర్ తెలిపారు. వాస్తవానికి బయటనుంచి మట్టి తీసుకురావాల్సి ఉన్నా.. చెరువు స్థలంలో తవ్వకాలు చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలా తవ్విన గుంతల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చెరువు స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి జేసీబీ, ట్రాక్టర్లతో లోనికి వెళ్లారని ఆరోపించారు.

కారడవిలో ఉరేసుకున్న వ్యక్తి