
ఆదర్శనీయుడు వనజీవి రామయ్య
తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య అందరికీ ఆదర్శనీయుడని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మి అన్నారు. మంగళవారం రామయ్య జయంతిని పురస్కరించుకుని కోకట్ టీజీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్క మొక్క నాటడంతో ప్రారంభించిన వనజీవి రామయ్య తన జీవిత కాలంలో సుమారు 3కోట్ల వరకు మొక్కలు నాటారన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని మెచ్చిన ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయన్నారు. వృక్ష సంపద పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, తద్వారా పంటలు పండటం, పర్యావరణం కలుషిత రహితంగా మారుతుందన్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వయసు పైబడినా మొక్కలు నాటే ప్రక్రియను మాత్రం ఆయన వదిలిపెట్టలేదన్నారు. కావున అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని విస్తారంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ సరస్వతి, సామాజిక కార్యకర్త వెంకట్, గాజుల బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జయంతి వేడుకలు