
సమన్వయం చేసుకుంటూ పనులు చేయాలి
అనంతగిరి: జిల్లాలోని విద్యుత్ అధికారులు రైతులను సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీజీఎస్‌పీడీసీఎల్ సంస్థ చీఫ్ ఇంజనీర్లు సాయిబాబా, పెరుమాళ్ల ఆనంద్, బాలస్వామి అన్నారు. వికారాబాద్‌లోని విద్యుత్ కార్యాలయంలో టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫరూకి ఆదేశాల మేరకు బుధవారం సంస్థ చీఫ్ ఇంజనీర్లు జిల్లా విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు 2,058 విద్యుత్ కనెక్షన్లు విడుదల చేశామన్నారు. ఇందులో 277 నియంత్రికలు, 116 కేఎం కండక్టర్, 78 కేఎం కేబుల్ సంబంధిత విద్యుత్ స్తంభాలు, మ్యాచింగ్ మెటీరియల్ రైతులకు అందజేశామన్నారు. వచ్చే జులైలో మరో 2వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్‌ఈ రవిప్రసాద్, డీఈలు, ఎస్‌ఏఓలు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.