
వికటించిన ‘పాఠం’
● బయాలజీ టీచర్‌పై వేటు ● ఆవు మెదడుతో ప్రయోగాత్మక బోధన ● ఉపాధ్యాయురాలి తీరుపై హిందూసంఘాలు, బీజేపీ ఆందోళన ● ఘటనపై విచారణ జరిపిన ఎంఈఓ, సీఐ ● టీచర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు ● హెచ్‌ఎం ఫిర్యాదుతోపీఎస్‌లో కేసు నమోదు
యాలాల: పదో తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య చెప్పాలనుకున్న బయాలజీ టీచర్ ఆలోచన వికటించింది. జంతువుల్లో మెదడు పనితీరు, నియంత్రణ విషయాలను వివరించేందుకు ఆవు మెదడును స్కూల్‌కు తీసుకెళ్లడం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయమై హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల ఆందోళనలతో ఘటనపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు సదరు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఖాసీమాబీ బయాలజీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వరిస్తున్నారు. ఇదిలా ఉండగా మెదడు పనితీరు, నియంత్రణ అంశంపై గత మంగళవారం టెన్త్ విద్యార్థులకు పాఠం బోధించారు. ఈ సమయంలో ఓ జంతువు మెదడును ప్రదర్శిస్తూ విద్యార్థులకు లెస్స్‌న్ చెప్పారు. ఇది ఏ జంతువు మెదడు మేడమ్..? అని విద్యార్థులు అడగగా.. ఆవు మెదడు అని చెప్పారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఆవు మెదడును తెచ్చి తమ మేడమ్ పాఠం చెప్పారని తల్లిదండ్రులకు వివరించారు. ఈ విషయం స్థానిక యువకులు, హిందూ సంఘాల నాయకులకు తెలియడంతో బుధవారం గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాత మెదడును ప్రదర్శించిన టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రూరల్ సీఐ నగేష్, ఎస్‌ఐ గిరి, ఎంఈఓ రమేశ్ స్కూల్‌కు చేరుకుని, వివరాలు సేకరించారు. పాఠ్యాంశం విన్న విద్యార్థులతో పాటు తోటి ఉపా ధ్యాయుల నుంచి వివరాలు సేకరించి, జిల్లా విదాధికారికి నివేదిక అందజేశారు. ఘటనకు కారణమైన టీచర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ, ఎంఈఓ పేర్కొనడంతో ఆందోళనకారులు శాంతించారు. అధికారుల రిపోర్ట్ అందుకున్న డీఈఓ రేణుకాదేవి టీచర్ ఖాసీమా బీని సస్పెండ్ చేస్తూ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశా రు. మరో వైపు ఇదే ఘటనకు సంబంధించి పాఠశాల హెచ్‌ఎం మల్లమ్మ ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు.

వికటించిన ‘పాఠం’