
ఫిట్‌లెస్..!
బడి బస్సుల భద్రతపై అనుమానాలెన్నో
● జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 195 ● రిజిస్ట్రేషన్ అయిన స్కూల్ బస్సులు 250 ● అనధికారికంగా తిప్పుతున్నవి వందకు పైనే.. ● ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయినవి 40 మాత్రమే ● మరో నాలుగు రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
వికారాబాద్: బడి బస్సు భద్రమేనా..? అంటేకాదనే సమాధానం వస్తోంది. తరచూ స్కూల్ బస్సులు మొరాయిస్తూనే ఉన్నాయి. బ్రేకులు ఫెయిల్ కావటం.. రోడ్డు పక్కకు దూసుకెళ్లడం.. ప్రమాదాలకు గురికావడం సర్వసాధారణంగా మారింది. గతే డాది కూడా స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురైన ఘటనలు మనం చూశాం. ఈ నెల 12నుంచి పాఠ శాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బడి బస్సులు కండీషన్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 195 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 250 వరకు రిజిస్ట్రేషన్ అయిన బస్సులు ఉన్నాయి. మరో వంద బస్సులను అనుమతులు లేకుండా తిప్పుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 40 బస్సులు మాత్రమే యాజమాన్యాలు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోగా మిగతా వారు దరఖాస్తు కూడా చేసుకోలేదు. నిబంధనలు తుంగలో తొక్కి బస్సులు తిప్పుతునఆన ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
నిబంధనలకు నీళ్లు
చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాత బస్సులు కొనుగోలు చేసి వాటికి పేయింట్ రుద్ది కొత్త బస్సుల్లా కలరింగ్ ఇస్తున్నారు. ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్ చెక్ చేసే సమయంలో బస్సు టైర్లు, పేయింటింగ్, రేడియం స్టిక్కర్లు, లైట్లు, సీట్లు, అనుభవం, నైపుణ్యంగల డైవర్లు ఇలా అన్నీ పరిశీలించాలి. కానీ నామమాత్రంగా చెక్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు ఉన్నా యి. దీంతో ఏటా బస్సులు ప్రమాదాలకు గురై చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలో 15 సంవత్సరాలు దాటి ఫిట్‌నెస్ లేని బస్సులు వందకు పైగా ఉన్నట్లు సమాచారం. వీటికి ఫిట్‌నెస్ టెస్టులు చేయించుకోకుండా ఆర్టీఏ అధికారులను మ్యానేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ బస్సు నడపాలంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. ఐదు సంవత్సరాల అనుభవం తప్పనిసరి. కానీ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇవేవీ పాటించటంలేదు. జిల్లాలో మొత్తం 45 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుండగా 50 శాతం మంది స్కూల్ బస్సుల్లోనే పాఠశాలలకు వెళ్తున్నారు. మరో నాలుగు రోజుల్లో 200 స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయడం సాధ్యమేనా అనేది ప్రశ్న తలెత్తుతోంది.
పాటించాల్సిన నిబంధనలు
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. కంటి చూపు, షుగర్, బీపీ, ఫిట్స్, గుండెజబ్బులు లేనివారిని మాత్రమే డ్రైవర్లుగా నియమించుకోవాలి. వారికి ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించాలి.
ఆర్టీఏ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు దాటిన బస్సులను విద్యార్థుల రవాణాకు వినియోగించరాదు.
60 సంవత్సరాలు నిండిన వారిని డ్రైవర్లుగా కొనసాగించరాదు.
బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ పరికరాలు కచ్చితంగా ఉంచాలి. అందులో మందులు ఉండేలా చూసుకోవాలి. కాలం చెల్లిన మందులు, పరికరాలు ఎప్పటికప్పుడు మార్చాలి.
విద్యా సంస్థల పేరు, ఫోన్ నంబర్ బస్సుకు ఎడమవైపు వెనకభాగంలో కనిపించేలా రాయించాలి. బస్సులో అటెండర్‌ను కచ్చితంగా ఉండాలి.
చిన్నారులు బస్సు ఎక్కడం, దిగటం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించేలా కుంభాకార అద్దాలు ఏర్పాటు చేసుకోవాలి.
విద్యార్థుల బ్యాగులు ఉంచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి.
ప్రతి పది బస్సులకు అదనంగా మరో బస్సును అందుబాటులో ఉంచుకోవాలి. రక్షణ చర్యల్లో భాగంగా కిటీకీల మధ్యలో రాడ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
ఫుట్ బోర్డులో మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించ రాదు. మిగతా అన్ని మెట్లు కూడా జారకుండా లోహంతో నిర్మితమై ఉండేలా చూసుకోవాలి.
తల్లిదండ్రులు కూడా బస్సులు బాగున్నాయా లేదని అని పరిశీలించాలి.
నోటీసులు ఇచ్చాం
పాఠశాలల పునఃప్రారంభం లోపే స్కూల్ బస్సుల కు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి. నిబంధనలకు లోబడి బస్సులో అన్ని పరికరాలు ఉండేలా చూసుకోవాలి. ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోని వారికి నోటీసులు ఇచ్చాం. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కే బస్సులను సీజ్ చేస్తాం.
– వెంకట్‌రెడ్డి, డీటీఓ, వికారాబాద్

ఫిట్‌లెస్..!