
బషీరాబాద్ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
బషీరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవి కోసం బీఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మార్చి 6న పాత కమిటీ పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త చైర్‌పర్సన్‌ను నియమించలేదు. ఈ సీటు ఎస్టీ మహిళకు రిజర్వు కావడం, పదవీ కాలాన్ని రెండేళ్లకు పెంచడంతో మండలానికి చెందిన ముగ్గురు నేతలు తమ సతీమణులను పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డైరెక్టర్ల సంఖ్యను సైతం 14నుంచి 18కి పెంచారు. దీంతో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా చైర్‌పర్సన్ సీటును తన భార్య శాంతాబాయికి ఇవ్వాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రామునాయక్ కోరుతున్నారు. అలాగే మంతన్‌గౌడ్‌తండాకు చెందిన సీనియర్ నాయకుడు ధన్‌సింగ్ తన భార్య కవితకు అవకాశం ఇవ్వాలని, భోజ్యానాయక్‌తండాకు చెందిన మరో నాయకుడు మన్యానాయక్ తన సతీమణికి చాన్స్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు తన అనుచరుడైన ధన్‌సింగ్ భార్యకు పదవి ఇవ్వాలని ఇప్పటికే ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలిసింది. రామునాయక్‌కు పార్టీ మండల అధ్యక్ష పదవి ఉన్నందున అతడి భార్యకు చైర్మన్ పదవీ బదులు డైరెక్టర్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఆశీస్సులు ఉన్నవారికే చైర్‌పర్సన్ పదవి దక్కుతుందని ప్రచారం జరగడంతో మన్యానాయక్ నేరుగా మాజీ ఎమ్మెల్యే వద్ద కూర్చుని తన భార్య పేరు ప్రతిపాదించాలని కోరినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. అయితే బషీరాబాద్ మండలం ఎమ్మెల్యే సొంత మండలం కావడంతో ఎమ్మెల్యే తండ్రి విఠల్‌రెడ్డి పార్టీ వ్యవహారాలు చూస్తుంటారు. ఈక్రమంలో డైరెక్టర్ల విషయంలో ఆయన చెప్పిన వారికి కూడా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ వర్గ వారికి కూడా డైరెక్టర్ పదవుల ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ప్రజాధరణ పొందిన ముఖ్యమైన నాయకులకు డైరెక్టర్ పదవులు ఇవ్వడానికి ఆశ చూపుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పదవుల పంపిణీ వ్యవహారం వారం రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
బషీరాబాద్ మార్కెట్ కమిటీ కుర్చీ కోసం పోటాపోటీ
ఎస్టీ మహిళకు చైర్‌పర్సన్ పీఠం
ఎమ్మెల్యే పరిశీలనలో ముగ్గురు నేతల సతీమణుల పేర్లు