
వికారాబాద్: వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతుల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం సద్దిమూటకు మోక్షం కలిగింది. పరిగి వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం నుంచి పథకం ప్రారంభం కానుంది. స్థానిక ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చేతులమీదుగా సద్దిమూటకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా మొట్టమొదటగా మూడేళ్ల క్రితమే పరిగి మార్కెట్‌కు పథకం మంజూరైంది. కానీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ప్రారంభానికి ముహూర్తం కుదరలేదు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ అశోక్ చొరవ తీసుకుని ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో రైతన్నలు, మార్కెట్‌లో పనిచేసే హమాలీలకు రూ.5కే భోజనం లభించనుంది. పరిగి తర్వాత జిల్లాలోని అన్ని మార్కెట్లకు దీన్ని విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. సద్దిమూట భోజనంలో అన్నంతో పాటు పప్పు, కూరగాయలతో వండిన కర్రీ, పప్పుచారు, మజ్జిగ, పాపడాలు అందజేస్తారు.
2014లో ప్రారంభం
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో 2014లో మొదటిసారి ఈ పథకం ప్రారంభమైంది. నిత్యం వ్యవసాయ మార్కెట్లకు వచ్చే రైతులు, అందులో పనిచేసే హమాలీలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. రైతులు, హమాలీలు రూ.5 చెల్లిస్తే.. మిగితా ఖర్చును సంబంధిత మున్సిపాలిటీలు, పంచాయతీలు భరించాలి. పథకం ప్రారంభానికి ముందు కేవలం నిర్వహణ కోసం మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.
నేటినుంచి పరిగి మార్కెట్లో రూ.5కే భోజనం
మూడేళ్ల ఎదురు చూపులకు తెర
పథకాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
రైతులు, హమాలీలకు కడుపునిండా తిండి
ఖర్చు కష్టమే..
పరిగిలో సద్దిమూటను ప్రారంభించి రైతులు, హమాలీలకు భోజన సదుపాయం కల్పించటం హర్షణీయం. పాత్రల కొనుగోలు కోసం మాత్రమే ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఆతర్వాత మున్సిపాలిటీలే ఖర్చు పెట్టడం కష్టమైన పని. పథకం ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి.
– వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సద్దిమూట పథకం జిల్లాలో ముందుగా పరిగి వ్యవసాయ మార్కెట్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ పథకం మంజూరు కోసం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. రైతులు, హమాలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఎ.సురేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, పరిగి

