జెడ్పీ భవన నిర్మాణమెన్నడో?

 బేస్మెట్‌కే పరిమితమైన జిల్లా పరిషత్‌ భవన నిర్మాణ పనులు - Sakshi

వికారాబాద్‌ : జిల్లాపరిషత్‌ భవన నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన పనులు నేటికీ బేస్మెట్‌ దాటి ముందుకు సాగడంలేదు. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా 2019లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలతో నూతన జిల్లా పరిషత్‌ జనరల్‌బాడీ ఏర్పాటయ్యింది. నూతన జిల్లా ఏర్పాటయ్యి ఆరేళ్లు, జిల్లా పరిషత్‌ జనరల్‌ బాడీ కొలువుదీరి నలుగేళ్లు కావస్తున్నా వారికి గూడు కరువయ్యింది. వికారాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలోనే వారు జిల్లా పరిషత్‌ సేవలు అందించాల్సి వస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్‌ జనరల్‌ బాడీ సమావేశం కోసం మరో భవనం వెతుక్కోవాల్సి వస్తోంది.

శంకుస్థాపన చేసి ఏడాది..

నూతన జిల్లా ఏర్పాటు చేసి ఆరేళ్లు గడిచినా జిల్లా పరిషత్‌ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. జిల్లాకు గుండెకాయలాంటి జిల్లా పరిషత్‌కు సొంత భవనం మంజూరు చేయించడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఏడాది క్రితం జిల్లా పరిషత్‌ నుంచే రూ.5.15 కోట్ల వ్యయంతో జెడ్పీకి సొంత భవనం నిర్మించాలని నిర్ణయించారు. నిధులు మరిన్ని కేటాయిస్తారనే ఆశతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దాయాకర్‌రావు, మంత్రి సబితారెడ్డిల చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేయించారు. అదనపు నిధుల సంగతే మోకానీ జిల్లా పరిషత్‌ నుంచి కేటాయించిన నిధులకు సంబంధించిన పనులు కూడా జరగడంలేదు. ఏడాది క్రితం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించగా ఇంకా బేస్మెట్‌ దాటి ముందుకు సాగడంలేదు. అయితే రూ. 5.15 కోట్ల నిధులు సరిపోవని గుర్తించిన ఇంజనీరింగ్‌ అధికారులు మరో రూ. 5 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. భవన నిర్మాణానికి గడువు 18 నెలలు ఇవ్వగా ఇప్పటికే ఏడాది గడిచింది. కావాల్సిన దాంట్లో ఇంకా సగం నిధులు మంజూరు చేయాల్సి ఉండగా జెడ్పీ ద్వారా కేటాయించిన నిధుల్లోంచి సగం కూడా ఖర్చు చేయలేదు. మరో ఆరు నెలలు మాత్రమే గుడువు ఉన్న నేపథ్యంలో నిర్మాణ పనులు పూర్తి చేయడం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇంజనీరింగ్‌ అధికారుల అలసత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిధులు రాబట్టడంలో విఫలం..

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న జిల్లా పరిషత్‌ భవనానికి అవసరమైన అదనపు నిధులు రాబట్టడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. భవనానికి శంకుస్థాపన చేసిన సమయంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు పలు హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేశారు. ప్రతి జెడ్పీటీసీ సభ్యుడికి రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాది దాటినా ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు.

ఏడాదైనా బేస్మెట్‌ దాటని పనులు

అమలుకాని మంత్రి ఎర్రబెల్లి హామీలు

గడువులోగా నిర్మాణం ప్రశ్నార్థకమే

పనులు వేగవంతం చేస్తాం

జిల్లా పరిషత్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్న మాట వాస్తవమే. కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడంలో కొంత జాప్యం ఏర్పడింది. ఈ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఏడాదిన్నర గడువు ఇవ్వగా అందులో ఏడాది ముగిసింది. మరో ఆరు నెలల గడువు ఉంది. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు వేగవంతం అయ్యేలా చూస్తాం. అదనపు నిధుల కోసం కూడా ప్రతిపాదనలుపంపించాం.

– శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, పీఆర్‌

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top