
బాలిక మృతితో అప్రమత్తం
చంద్రగిరి : ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాలిక (16) విష జ్వరంతో బుధవారం మృతి చెందడంపై గురువారం వైద్యాధికారులు స్పందించారు. ఇందిరమ్మ కాలనీలో గురువారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపట్టారు. అదే విధంగా ప్రతి ఇంటి వద్ద యాంటి లార్వా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇందిరమ్మ కాలనీలో ఎవరికి ఎలాంటి జ్వరాలు లేవని వైద్యాధికారులు నిర్ధారించారన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాచి, చలార్చి తాగాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమ తెరలను వినియోగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వేడి ఆహారం, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సెల్వి యా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప కుమార్, పీహెచ్‌సీ వైద్యాధికారిణి ప్రియాంక, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.