
నిరంతరం బిజీ జీవితంతో మానసిక, శారీరక అలసట
ఉద్యోగుల ఉత్పాదకత, పనితీరుపై ప్రతికూల ప్రభావం
వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌లో విఫలం కావటమూ కారణమే
50 శాతం కంటే ఎక్కువ మందిలో బర్న్ ఔట్ సమస్య
పలు ఆధ్యయనాల్లో వెల్లడి
ఆధునిక జీవన శైలిలో దాదాపు అందరూ బిజీగా మారిపోయారు. రోజంతా క్షణం తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉంటున్నారు. ఇలా దీర్ఘకాలంపాటు పనిచేయటం వల్ల చాలామంది ‘బర్న్ ఔట్’పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగ పరంగా తీవ్రంగా అలసిపోవటాన్నే బర్న్ ఔట్ అంటారు.
దీనివల్ల పనిపై ఏకాగ్రత కోల్పోవడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఉత్పాదకత, పనితీరు తగ్గిపోతుంది. ఉద్యోగుల్లో ఈ బర్న్‌ఔట్ సమస్య ఇటీవల గణనీయంగా పెరిగిందని పలు సర్వేల్లో తేలింది. 50 శాతం కంటే ఎక్కువ మంది బర్న్ ఔట్‌ను ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం సాధించడంలో విఫలం కావడమే ఇందుకు కారణమని అంటున్నారు.
⇒ తమ రోజువారీ జీవితంలో అత్యంత బిజీగా గడిపేవారు ఒత్తిడికి గురవుతున్నారు. ఇష్టమైన పని అయినా మితిమీరి చేయడంతో బర్న్ ఔట్’కు గురవుతారు. దీనివల్ల ముఖ్యమైన బాధ్యతలపై పూర్తి దృష్టిని కేంద్రీకరించే పరిస్థితులు ఉండడం లేదు. కోపం, చిరాకు పరిపాటిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు తమను తాము ‘సెల్ఫ్ ఆడిట్’చేసుకుని పని భారాన్ని తగ్గించుకొనే విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి.
సమస్యను అధిగమించడానికి సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్‌ను సంప్రదించాలి. ఏదైనా క్రీడలో పాల్గొనడం, వీకెండ్స్‌లో మిత్రులతో గడపడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటి ఏదో ఒక కొత్త హాబీని అలవరుచుకుని ఒత్తిడిని అధిగమించి ‘బర్న్ ఔట్’కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. – సి.వీరేందర్, సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్
వివిధ సంస్థల సర్వేల్లో తేలిన అంశాలు
⇒ ఫోర్బ్స్ పరిశీలన ప్రకారం 66 శాతం మంది కారి్మకులు బర్న్ ఔట్‌కు గురవుతున్నారు. మరొక నివేదిక ప్రకారం అమెరికాలోని 44 శాతం ఉద్యోగులు బర్న్ ఔట్‌కు గురవుతున్నారు. దీనివల్ల విధులకు గైర్హాజరు పెరుగుతోంది. వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయడంతో పాటు శారీరక, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ పేర్కొంది.
⇒ ఇటీవల ఇండియా టుడేలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చాలా మంది ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయాల్సి రావటం, చేస్తున్న పనులకు సరైన గుర్తింపు లేకపోవడం, ఉన్నతాధికారుల నుంచి తగిన మద్దతు లభించకపోవడం వంటివి బర్న్ ఔట్‌కు ప్రధాన కారణాలుగా తేలింది. ‘నిరంతరం బిజీగా ఉండాలనే ఒత్తిడి, తరచుగా అంచనాలు అందుకోలేకపోవడంతో ఒత్తిడి, అలసటకు గురవుతున్నారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం చూపి ఉత్పాదకత, పనితీరు తగ్గడానికి దారితీస్తోంది’అని ద ఎకనామిక్ టైమ్స్ సర్వే పేర్కొంది.
⇒ దాదాపు 52 శాతం మంది ఉద్యోగులు వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేక బర్న్ ఔట్‌కు గురవుతున్నట్టు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో న్యూయార్క్‌కు చెందిన వెర్టెక్స్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితి నుంచి ఉద్యోగులను బయటపడేయాలంటే వారాంతాల్లో వారితో ఎక్కువ గంటలు పనిచేయించడం మానేయాలని సూచించింది. సంస్థల పురోగతికి ఉద్యోగుల ‘మెంటల్ వెల్ బీయింగ్’ఎంతో ముఖ్యమని పేర్కొంది.
⇒ ఉద్యోగులు బిజీగా ఉండటం వల్ల నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నిర్లక్ష్యానికి గురవుతాయి. ఇవన్నీ శారీరక, మానసిక అంశాలపై దు్రష్పభావం చూపిస్తాయి అని హోప్ ట్రస్ట్ తన అధ్యయనంలో పేర్కొంది.
⇒ పై అధ్యయనాలకు భిన్నంగా జనరేషన్ జెడ్‌గా పిలుస్తున్న (1997–2012 మధ్యలో పుట్టినవారు) వారు తమ చుట్టూ జరుగుతున్న మార్పులను నిశితంగా గమనిస్తూ, పనిప్రదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తూ వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌తో పాటు తాము కోరుకున్న విలువలకు అనుగుణంగా జీవన శైలి, కెరీర్లను ఎంచుకుంటున్నట్టు డెలాయిట్ 2024 జెన్ జెడ్ అండ్ మిలీనియల్ సర్వే పేర్కొంది.