6 నుంచి 10 తరగతులకు డిజిటల్‌ బోధన

Digital Classes for 6th to 10th - Sakshi

టీశాట్, దూరదర్శన్‌ (యాదగిరి) చానళ్ల ద్వారా ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో విద్యా బోధన ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉన్నత తరగతులైన 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలను (వీడియో పాఠాలను) ప్రసారం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా వారికి వర్క్‌షీట్లు అందజేసి, అసైన్‌మెంట్స్‌ ఇవ్వడం ద్వారా విద్యా కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రతిపాదనలను రూపొందించింది. అన్ని తరగతులకు సంబంధించి 900కు పైగా డిజిటల్‌ పాఠాలు ఇప్పటికే రూపొందించి ఉన్నందున వాటిని టీశాట్, దూరదర్శన్‌ (యాదగిరి) చానళ్ల ద్వారా ప్రసారం చేస్తూ విద్యా బోధనను అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. 

ఆగస్టు 15 నుంచి వీడియో పాఠాల బోధనకు కసరత్తు చేస్తోంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే వాటి ప్రకారం ముందుకుసాగాలని, లేదంటే ఆగస్టు 15 నుంచి ప్రత్యామ్నాయ అకడమిక్‌ కేలండర్‌ అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ప్రభుత్వం సరేననగానే వీడియో పాఠాల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రత్యక్ష విద్యా బోధనపై విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై స్పష్టత, సమగ్ర మార్గదర్శకాలు జారీ అయ్యాకే, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ముందుకుసాగాలని భావిస్తోంది. 

డిజిటల్‌ పాఠాల టైం టేబుల్‌
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ప్రజ్ఞత’పేరుతో జారీచేసిన ఆన్‌లైన్, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శకాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ టైంటేబుల్‌ను సిద్ధంచేసింది. తరగతుల వారీగా, రోజువారీగా ఏయే సమయాల్లో ఏయే సబ్జెక్టు పాఠాలను ప్రసారం చేయాలనే వివరాల్ని ఇందులో పొందుపరిచింది. రోజూ ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలు మాత్రమే ఈ విద్యా బోధన ఉండాలని కేంద్రం స్పష్టంచేసిన నేపథ్యంలో ఆ దిశగానే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఉన్నత తరగతులకు గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే బోధించేలా చర్యలు చేపట్టనుంది. అదీ ఒక్కో సెషన్‌ 30 నుంచి 45 నిమిషాలే ఉండేలా టైంటేబుల్‌లో పేర్కొన్నట్లు తెలిసింది.  

ప్రైమరీ తరగతులకు వర్క్‌షీట్స్, అసైన్‌మెంట్స్‌ 
ప్రాథమిక తరగతులను (1 నుంచి 5వ తరగతి వరకు) వర్క్‌షీట్స్, అసైన్‌మెంట్స్‌ పద్ధతుల్లోనే కొనసాగించాలని ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వారికిప్పుడు రెగ్యులర్‌ తరగతుల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. మరోవైపు వీడియో పాఠాలు ప్రసారం చేసినా ప్రాథమిక తరగతుల విద్యార్థులు శ్రద్ధగా వినే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వర్క్‌షీట్స్, అసైన్‌మెంట్స్‌ ఇవ్వడం వంటి యాక్టివిటీని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కొంత మంది టీచర్లను స్కూళ్లకు పంపించడం ద్వారా ప్రాథమిక తరగతులకు కూడా విద్యా కార్యక్రమాలను కొనసాగించవచ్చని పేర్కొంది.  

అనుమానాల నివృత్తికి ప్రత్యేకంగా ఒకరోజు 
టీవీ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను వినే క్రమంలో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన అనుమానాల నివృత్తికి ఒక్కో తరగతికి ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో టీచర్లతో పాటు వారి ఫోన్‌ నంబర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. పాఠశాల స్థాయిలో ఫోన్‌ సదుపాయం ఉన్న విద్యార్థులు, సబ్జెక్టు టీచర్లతో వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసి అందుబాటులో ఉంచేలా, మండల స్థాయిలో సబ్జెక్టు గ్రూపులను ఏర్పాటుచేసేలా ప్రణాళికలు వేసింది. గ్రామాల్లో టీవీ, ఫోన్‌ సదుపాయం లేని విద్యార్థులుంటే వారు స్కూల్‌కు వెళ్లి నేర్చుకునేలా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పాఠశాలల్లో టీచర్లను రొటేషన్‌ పద్ధతిలో స్కూళ్లలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు గ్రామపంచాయతీ సౌజన్యంతో అలాంటి విద్యార్థుల కోసం ఒక టీవీని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయించడం ద్వారా ఆయా విద్యార్థులకు వీడియో పాఠాలను అందించవచ్చని భావిస్తోంది. ఇక పాఠశాలల్లో టీచర్లను ఎంతమందిని అందుబాటులో ఉంచాలి?, లేదా అందరినీ స్కూళ్లకు పంపించాలా? అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థుల కోసం మాత్రం రొటేషన్‌ పద్ధతిలో కొంతమంది టీచర్లను మాత్రం కచ్చితంగా పాఠశాలల్లో ఉంచాలని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top