
స్కిల్స్ పేరుతో యూనివర్సిటీల్లో క్లాసులు
అది చట్ట విరుద్ధమంటూ మండలి నోటీసులు
ఇది మీ పరిధిలోకి రాదంటూ సంస్థల సమాధానం
ప్రభుత్వం దృష్టికి విషయం... ప్రత్యేక కమిటీ ఏర్పాటు యోచన
సాక్షి, హైదరాబాద్: చట్ట విరుద్ధంగా కోచింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంస్థలను నియంత్రించటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిని దారికి తెచ్చేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులతో ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తోంది. ఇంజనీరింగ్‌లో నైపుణ్యం పేరుతో కొన్ని సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల్లోకి స్కిల్ పేరుతో చొరబడుతున్న ఈ కంపెనీల వల్ల జరిగే నష్టాలను మండలి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. స్కిల్ కోసం షార్ట్‌కట్స్‌లో ఇవి బోధిస్తున్నాయి. సబ్జెక్టు ఫ్యాకలీ్టలో నాణ్యత పాటించడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ కోచింగ్ కేంద్రాలకు వెళ్లడం వల్ల నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి మండలి తెలిపింది.
ఏం చేస్తారో చేసుకోండి
ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ కేంద్రాలు నడుపుతున్న సంస్థలకు గత నెలలో ఉన్నత విద్యా మండలి నోటీసులు ఇచి్చంది. అయితే, నోటీసులు పొందిన సంస్థలు మండలికి ఘాటుగా సమాధానం ఇచ్చాయి. తామెక్కడా చట్ట వి రుద్ధంగా బోధన చేయడం లేదని, విద్యార్థులు స్కిల్ కోసం తమ దగ్గరకు వస్తున్నారని పేర్కొన్నాయి. అసలు తమను నియంత్రించడం, నోటీసులు ఇచ్చే అధికారం ఉన్నత విద్యా మండలికి లేదని న్యాయవాదులతో సమాధానం ఇవ్వడంతో మండలి వర్గాలు నివ్వెరబోయాయి.
ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు ఆ సంస్థల్లో చేరిన విద్యార్థులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం, మండలి అధికారులను తప్పుబడుతూ విద్యార్థులు మెయిల్స్ ఇవ్వడంతో సమస్య తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో చెప్పాలని మండలి అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సీఎం కార్యాలయం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల దీనిపై చర్చించింది.
కట్టడి చేయకుంటే కష్టమే
ఇంజనీరింగ్ పూర్తవ్వగానే ఉద్యోగం పొందడం ఒక్కటే లక్ష్యంగా భావిస్తున్న విద్యార్థుల బలహీనతను కోచింగ్ కేంద్రాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇందులో డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలు ప్రధానంగా భాగస్వామ్యం అయ్యాయి. సబ్జెక్టులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, కేవలం ఉద్యోగం పొందేందుకు కొత్తగా వస్తున్న చాట్ జీపీటీ, ఏఐ సంబంధిత టెక్నాలజీపైనే షార్ట్ కట్స్ బోధిస్తున్నాయి. ఈ క్రమంలో కీలకమైన ఫ్యాకలీ్టని కూడా తగ్గిస్తున్నాయి. హైదరాబాద్‌లోని రెండు డీమ్డ్ వర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ వర్సిటీల ఆఫ్ క్యాంపస్‌లపై గత ఏడాది కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కాలేజీల్లో కాకుండా, స్కిల్ కేంద్రాల్లో బోధిస్తున్నారు.
పరీక్షలు నిర్వహించి, డిగ్రీలు ఇవ్వడం మాత్రం కాలేజీల్లోనే జరుగుతోంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని మండలి పేర్కొంది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో బేసిక్స్ నేర్పుతారు. రెండు, మూడు సంవత్సరాల్లో కీలకమైన కోడింగ్‌పై సబ్జెక్టులు ఉంటాయి. ఇదే క్రమంలో ఎమర్జింగ్ కోర్సులకు పారిశ్రామిక భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థి కోడింగ్‌పై పట్టు సాధిస్తాడు. ఏఐ చేసే కోడింగ్, డీ–కోడింగ్ కచి్చతమైనదేనా? కాదా? అనేది సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పుడే తెలుస్తుంది. ప్రైవేటు కాలేజీలు దీన్ని విస్మరించి ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్స్‌ను మాత్రమే నేర్పుతుండటంతో ఉద్యోగం వచి్చనా, పనిలో పురోగతి సాధించలేకపోతున్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీ కంపెనీల్లో అనేక మంది కోడింగ్‌పై పట్టు లేకపోవడం వల్లే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
చట్ట విరుద్ధంగా నడుపుతున్న కోచింగ్ కేంద్రాలకు నోటీసులు ఇచ్చాం. సమాధానం వచ్చింది. అయితే, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో దీనిపై విధాన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్