దిశ మారిన దిత్వా | - | Sakshi
Sakshi News home page

దిశ మారిన దిత్వా

Dec 3 2025 7:59 AM | Updated on Dec 3 2025 7:59 AM

దిశ మారిన దిత్వా

దిశ మారిన దిత్వా

వాయుగుండంగా పుదుచ్చేరి తీరం వైపునకు..

చైన్నెలో 30 చోట్ల భారీవర్షం

ఐదు చోట్ల వరుణ బీభత్సం

లోతట్టు ప్రాంతాలు జలమయం

అధికార యంత్రాంగం పరుగులు

వ్యాసార్పాడి పరిసరాలలో డిప్యూటీ సీఎం పరిశీలన

సాక్షి, చైన్నె: శ్రీలంకను అతలాకుతలం చేసి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన దిత్వా తుపాన్‌ తమిళనాడులోని డెల్టా జిల్లాలపై తొలుత ప్రభావాన్ని చూపించింది. పుదుచ్చేరి నుంచి చైన్నె వైపుగా కదిలిన సమయంలో ఇది బలహీన పడింది. సోమవారం అంతా చైన్నె తీరాన్ని సమీపంలో తీవ్ర వాయుగుండంగా దిత్వా కేంద్రీకృతం కావడంతో అనేక చోట్ల భారీ వర్షం పడింది. రాతంత్రా కూడా వర్షం పడింది. మంగళవారం ఉదయం నుంచి కాస్త తెరపించి తెరపించి వర్షం పడుతూ వచ్చింది. చైన్నె మీదుగా ఆంధ్రా వైపుగా దిత్వా వాయుగుండంగా బలహీనపడి ప్రయాణిస్తుందని తొలుత అంచనా వేశారు. అయితే, ఇది మంగళవారం దిశను మార్చుకుంది. మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడంతో క్రమంగా వర్షాలు చిరుజల్లుల మయంగా మారాయి. అప్పుడప్పుడూ అక్కడక్కడ చిరు జల్లులతో , మరికొన్ని చోట్ల మోస్తరుగా మంగళవారం అంతా వర్షం పడింది. తాజాగా మహాబలిపురానికి సమీపంలో కేంద్రీకృతమైన దిత్వా కారణంగా చెంగల్పట్టు, కాంచీపురం, దక్షిణ చైన్నెలలో వర్షం కురుస్తోంది. బుధవారం ఈ వాయుగుండం మహాబలిపురం – కల్పాకం మధ్య తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఒకే చోట కేంద్రీకృతమైన పక్షంలో బుధవారం కూడా తెరపించి తెరపించి వర్షాలు కొనసాగనున్నాయి. తిరువణ్నామలై, వేలూరు, విల్లుపురం, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలకు సైతం వర్షాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే సేలం, ఈరోడ్‌, దిండుగల్‌ తదితర జిల్లాలోనూ వర్షాలు పడనున్నాయి.

ముమ్మరంగా సహాయక చర్యలు..

చైన్నెలో వర్షం దాటికి 48 చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. పది చోట్ల నీళ్లలో పడ్డ వారిని పోలీసులు రక్షించారు. కార్పొరేషన్‌, రెవిన్యూ సిబ్బంది ఓ వైపు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు మరో వైపు తక్షణ సహాయక చర్యలలో మునిగాయి. దీంతో త్వరితగతిన ఆయా ప్రాంతాలలో నీటిని తొలగించారు. విరిగిన చెట్ల కొమ్మలను, నేలకొరిగిన చెట్లను తొలగించారు. చేట్‌ పట్‌లో ఓ పురాత గోడ కూలడంతో ఓ కారు ధ్వంసమైంది. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌ రిప్పన్‌ బిల్డింగ్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఉదయ నిధి, మంత్రులు కేఎన్‌ నెహ్రూ, శేఖర్‌బాబు తదితరులు ఆయా బాధిత ప్రాంతాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేయించారు. నీటి తొలగింపునకు పెద్ద ఎత్తున మోటారు పంపు సెట్లను ఉపయోగించారు. భారీ నుంచి అతి భారీ వర్షం అనేక చోట్ల పడ్డప్పటికీ, కొన్ని చోట్లమినహా తక్కిన చోట్లనీటిని త్వరితగతిన తొలగించారు. కాగా, ఎన్నూరులో వర్షం దాటికి నీట మునిగి రాజ్‌కుమార్‌ అనేయువకుడు మరణించారు. అలాగే రోడ్లపై ఉన్న గుంతల పుణ్యమా నీటిలో పడ్డ వాహనా దారులు అనేక మంది ఉన్నారు. ఇక, అంబత్తూరు పారిశ్రామక వాడలలో పరిశ్రమల యాజమాన్యాలు గత అనుభవాల దృష్ట్యాముందు జాగ్రత్తగా ఈ సారి ఇసుక బస్తాలను పెద్ద ఎత్తున తమ పరిశ్రమల ముందు రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.

ఒకే చోట కేంద్రీ కృతంతో వర్షం

దిత్వా ఒక రోజుకు పైగా ఒకే చోట్ల కేంద్రీ కృతం కావడంతో చైన్నె, శివారులలో అనేక చోట్ల భారీ వర్షం పడిందని రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ తెలిపారు. చైన్నె ఎళిలగంలోని స్టేట్‌ ఎమర్జన్సీ సెంటర్‌ నుంచి ఆయన పరిస్థితిని పరిశీలిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాతావరణ కేంద్రం హెచ్చరికలు, సమాచారాలు ఉన్నప్పటికీ, సహజ మార్పుల కారణంగా దిత్వా త్రీవ వాయుగుండంగా, ఆతదుపరి వాయుగుండంగా బలహీన పడి ఉందన్నారు. ఇప్పటి వరకు దిత్వా రూపంలో వర్షాలకు నలుగురు మరణించారని పేర్కొన్నారు. 582 పశువులు మరణించాయని, 1,601 గుడిసెలు, ఇళ్లు దెబ్బ తిన్నాయని వివరించారు. 1,127 కుటుంబాలకు చెందిన 3,534 మంది శిబిరాలలో ఉన్నట్టు పేర్కొన్నారు. చైన్నెలో రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలకు చెందిన 330 మంది సహాయక పనులలో దూసుకెళ్తున్నారని తెలిపారు. అక్టోబరులో కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న పంటకు గాను, హెక్టారుకు రూ. 20 వేలు అందించాలని సీఎం ఆదేశించినట్టు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాజాగా జరిగిన సర్వే మేరకు వర్షాల రూపంలో 85,521 హెక్టార్ల పంట , పంట పొలాలు నీట మునిగినట్టు గుర్తించామని వివరించారు. శ్రీలంకలో చిక్కుకున్న తమిళులందర్నీ సురక్షితంగా చైన్నెకు తీసుకు వచ్చినట్టు మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

బలహీన పడ్డ దిత్వా తన దిశను మార్చుకుంది. ఆంధ్రా వైపుగా కాకుండా మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదిలింది. బుధవారం మహాబలిపురం – పుదుచ్చేరి మధ్య మరింత బలహీన పడి వాయుగుండంగా తీరాన్ని తాకనుంది. చైన్నె, శివారులలో 30 చోట్ల భారీగా , మరో ఐదు చోట్ల అతి భారీగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు, మార్గాలు జలమయం అయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement