రోడ్ షోకు అనుమతి నో
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలి సారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని సిద్ధమైన విజయ్‌కు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. వివరాలు.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రయాణానికి కరూర్ విషాద ఘటన రూపంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు. డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ , బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్‌కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు. కరూర్ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరో వైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు.


