కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధం

Dec 3 2025 7:59 AM | Updated on Dec 3 2025 7:59 AM

కార్త

కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధం

● నేడు మహా దీపం వెలిగింపు ● ఉత్సవానికి భారీ ఏర్పాట్లు ● ప్రత్యేక బస్సులు, రైళ్లు ● కొండపైకి భక్తులకు అనుమతి లేదు

వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజైన బుధవారం ఉదయం 4 గంటలకు ఆలయం ఎదుటనున్న మూలవర్‌ సన్నధిలో భరణిదీపం వెలిగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు అర్ధనారేశ్వరుడు ఏడాదిలో ఒకసారి ప్రత్యేక వాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అరుణాచలేశ్వరాలయం వెనుకనున్న 2,668 అడుగుల కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. మహా దీపం వెలిగించే సమయంలో ఆలయం వద్దనున్న భక్తులు అరుణాచలేశ్వరునికి హరోం.. హరా.. అంటూ నామస్మరణాలు చేసుకుంటారు. మహా దీపోత్సవాన్ని తిలకించేందుకు 40 లక్షల మంది భక్తులు రానున్నారని ఆలయ అధికారుల అంచనా. కార్తీక దీపోత్సవం దృష్ట్యా అరుణా చలేశ్వరాలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఆలయంలో శివుడు అగ్నిరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

కొండపైకి భక్తులకు అనుమతి నిరాకరణ

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహాదీపం కొండపైకి భక్తులు ఎక్కేందుకు 11 రోజులు అనుమతి నిరాకరించారు. మహా దీపం వెలిగించే ఆలయ అర్చకులు, పారంపర్య వంశస్తులు, ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మహాదీపం 35 కిలోమీటర్ల నుంచి చూసినా దీప కాంతి సృష్టంగా కనిపించడం విశేషం. మహా దీపం పది రోజుల పాటు వెలుగుతూనే భక్తులకు దర్శనం ఇవ్వనుంది.

పటిష్ట బందోబస్తు

మహా దీపోత్సవానికి ఎస్పీ సుధాకర్‌ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. 39 ప్రాంతాల్లో తాత్కాలిక ఔట్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. మానవ రహిత విమానంతో కూడా ప్రత్యేక నిఘా ఉంచి చోరీలు జరగకుండా చూస్తామన్నారు. ఉదయం భరణి దీపం వెలిగించే సమయంలో అనుమతి ఇచ్చిన భక్తులు, మహా దీపం వెలిగించే సమయంలో 2,500 మందిని మాత్రమే ఆలయంలోనికి అనుమతిస్తామన్నారు. తిరువణ్ణామలైలో ట్రాఫిక్‌ను మూడు రోజులు మార్పు చేసినట్లు తెలిపారు.

కై లాస వాహనంలో ఊరేగిన

అరుణాచలేశ్వరుడు:

ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారు కై లాస వాహనంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు మూషిక వాహనంలో వినాయకుడు, హంస వాహనంలో వళ్లి, దేవసేన సమేత మురుగన్‌, కై లాస వాహనంలో ఉన్నామలై సమేత అన్నామలైయార్‌, కామధేను వాహనంలో పరాశక్తి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం మూషిక వాహనంలో వినాయకుడు, పురుష మునివాహనంలో చంద్రశేఖరుడు మాడ వీధుల్లో దర్శనమిచ్చారు. తిరువణ్ణామలై జిల్లాలో చినుకులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు వాటిని లెక్క చేయకుండా స్వామి వారి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మాడ వీధులతో పాటు తిరువణ్ణామలై పట్టణంలో ఎటు చూసినా భక్తుల మయంగా మారింది. ఇప్పటికే తిరువణ్ణామలై పట్టణంలో లాడ్జీలు, హోటల్స్‌, మాడ వీధుల్లోను భక్తులతో కిటకిటలాడుతుంది.

ప్రత్యేక బస్సులు:

దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 4,764 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కలెక్టర్‌ తర్పగరాజ్‌ తెలిపారు. ముందుస్తుగా 24 తాత్కాలిక బస్టాండ్‌లు, 130 చోట్ల పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఐదు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధం 1
1/1

కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement