సిట్ విచారణకే మొగ్గు
● సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్
సాక్షి, చైన్నె: కరూర్ ఘటనపై సీట్ విచారణకే అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసింది. అలాగే జస్టిస్ అరుణా జగదీశన్ ఏక సభ్యకమిషన్ విచారణ కొనసాగేందుకు విజ్ఞప్తి చేశారు. తమిళ వెట్రి కళగం నేత విజయ్ ప్రచారం సందర్భంగా కరూర్‌లో చోటు చేసుకున్న విషాద ఘటన గురించి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈకేసును సీబీఐ విచారిస్తున్నది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక కమిటీ సైతం తాజాగా రంగంలోకి దిగింది. సిబీఐ వద్ద సోమవారం విచారణ జరిపిన ఈ కమిటీ మంగళవారం బాధితుల వద్ద సమాచారాలు రాబట్టింది. బాధితుల ఫిర్యాదులను స్వీకరించింది. ఈ పరిస్థితులలో కేసును తొలుత హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్ విచారణ చేపట్టడం గురించిన ప్రస్తావనను మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. సుప్రీం కోర్టులో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సిబీఐ విచారణ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. సిట్ విచారణకే అవకాశం కల్పించాలని, అలాగే, అరుణా జగదీశన్ కమిషన్ విచారణ కొనసాగేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ ఒకటి రెండురోజులలో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
చైన్నె నుంచి బయలుదేరే 7 విమానాలు రద్దు
కొరుక్కుపేట: చైన్నె నుంచి అండమాన్, అహ్మదాబాద్, ముంబై, గౌహతి, కొచ్చి, భువనేశ్వర్‌కు వెళ్లే 6 దేశీయ విమానాలు, ఓ అంతర్జాతీయ విమానాన్ని అధికారులు మంగళవారం అకస్మాత్తుగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఎయిర్‌లైన్ ప్రతినిధులు మాట్లాడుతూ భారీ వర్షాలు, పరిపాలనా కారణాల వల్ల విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు.
తిరుప్పూర్ మేయర్‌కు జరిమానా
సాక్షి, చైన్నె : విద్యుత్ చోరీకి పాల్పడినారంటూ తిరుప్పూర్ కార్పొరేషన్ డీఎంకే మేయర్ దినేష్‌కుమార్‌కు విద్యుత్ బోర్డు రూ. 42 వేలు జరిమానా విధించడం చర్చకు దారి తీసింది. తిరుప్పూర్ మేయర్‌గా ఉన్న దినేష్‌కుమార్ ఇటీవల తాను నిర్మించిన భవనానికి గాను అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన విద్యుత్ చౌర్యానికి సైతం పాల్పడినట్టు గుర్తించిన విద్యుత్ బోర్డు వర్గాలకు ఆయనకు రూ. 42 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసులు పంపించారు. ఇది కాస్త డీఎంకేలో చర్చకు దారి తీసింది. డీఎంకేకు చెందిన మేయర్ విద్యుత్ చౌర్యానికి పాల్పడటం, ఇందుకు విద్యుత్ బోర్డు కన్నెర్ర చేయడం గమనార్హం.
వ్యక్తిగతంగానే సంప్రదింపులు
సాక్షి, చైన్నె: తనను వ్యక్తిగతంగా మాత్రమే బీజేపీ నాయకులు సంప్రదిస్తున్నారే గానీ, అధికారికంగా ఏమాత్రం కాదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. దినకరన్ నేతృత్వంలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగంను మళ్లీ కూటమిలోకి రప్పించే దిశగా బీజేపీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంప్రదింపు జరిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా నుంచి దినకరన్‌కు పిలుపు అందినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం గురించి దినకరన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ,తనతో పార్టీ పరంగా,కూటమి గురించి బీజేపీ నుంచి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఆపార్టీకి చెందిన వారు కొందరు తనతో ఉన్న వ్యక్తిగత పరిచయం మేరకు సంప్రదింపు జరుపుతున్నారే గానీ, అధికారికంగా తనతో ఎవ్వరూ మాట్లాడ లేదని స్పష్టం చేశారు.
నేడు తిరుప్పరన్కుండ్రంలో కార్తీక దీపోత్సవం
తిరువొత్తియూరు: తిరుప్పరన్కుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో భాగంలో మంగళవారం సాయంత్రం మురుగపెరుమాన్‌కు పట్టాభిషేకం జరిగింది. బుధవారం మహదీపం వెలిగించే వేడుక నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుప్పరన్కుండ్రం కొండపై మూడు ముప్పావు అడుగుల ఎత్తు, 70 కిలోల బరువైన రాగి కొప్పరిలో 400 కిలోల నెయ్యి, 250 మీటర్ల పొడవైన గాడా గుడ్డ, 5 కిలోల కర్పూరం ఉపయోగించి మహదీపం వెలిగిస్తారు. దీని తర్వాత ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలలో, ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించనున్నారు.


