
● నేటి నుంచి పంపిణీ ●ఈనెల 15 నుంచి 45 రోజుల స్వీకరణ ●‘మ
కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం కోసం
ఇంటింటా సోమవారం నుంచి దరఖాస్తుల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 15వ తేది నుంచి ఈ దరఖాస్తులను 45 రోజుల పాటూ స్వీకరించి, అర్హులైన వారిని రూ. 1000 నగదు పంపిణి పథకం నిమిత్తం ఎంపిక చేయనున్నారు. ఇందు కోసం మీతో స్టాలిన్ శిబిరాలు విస్తృతంగా నిర్వహించనున్నారు.
సాక్షి, చైన్నె: ఎన్నికల వాగ్దానంగా ఏడాదిన్నర్న క్రితం కలైంజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం( మహిళా హక్కు పథకం)ను ద్రావిడ మోడల్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతగా ఒక కోటి 6 లక్షల మందికి ఈ పథకం వర్తింప చేశారు. ఈ మేరకు అర్హులైన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతున్నది. అదే సమయంలో తమ కంటే తమకు లబ్ధి చేకూరడం లేదంటూ మహిళలు నినదించడంతో మరో మారు దరఖాస్తులు ఆహ్వానించగా, 11 లక్షల మందికి పైగా మహిళా అర్జీలు దాఖలు చేసుకున్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి సుమారు 7.35 లక్షల లక్షలమందికి వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద కోటి 15 లక్షల మంది మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. అయినా తమ కంటే తమకు రావడం లేదని నినాదించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అదే సమయంలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం స్టాలిన్ అర్హులైన మహిళలు అందరికి పథకం వర్తింప చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.
నేటి నుంచి స్వీకరణ
మహిళా ఉద్యోగిణులు, పెన్షనర్లు, పదవీ విరమణ పొందిన వారందర్నీ ఈ పథకంకు తాజాగా అర్హులుగా ప్రకటించారు. అలాగే నాలుగు చక్రల వాహనాలు కలిగిన వారికి సైతం అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. వీరికి అవకాశం కల్పించే విధంగా ఈనెల 15 నుంచి నీతో స్టాలిన్ నినాదంతో ప్రత్యేక శిబిరాల నిర్వహనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పది వేల శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. కడలూరు జిల్లా చిదంబరం వేదికగా ఈ శిబిరాలకు సీఎం స్టాలిన్ ఈనెల 15వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. తమిళనాడులోని లక్షలాది మంది ప్రజలు రోజూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,768 శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 6,232 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో పట్టణ ప్రాంతాల్లోని 13 ప్రభుత్వ విభాగాల నుంచి 43 సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో 15 విభాగాలకు చెందిన 46 సేవలు అందించనున్నారు. ఒక్క మహిళా హక్కు పథకమే కాదు, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, సేవలను వివరించే విధంగా, వాటి ప్రయోజనాలు, అర్హతల గురించి అవసరమైన సమగ్ర సమాచారాలను బుక్‌లెట్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. శిబిరం రోజున అర్హతగల మహిళలు అధికారుల్ని సంప్రదించి మహిళ హక్కు పథకం దరఖాస్తును సమర్పించే వీలు కల్పించారు. ఈ శిబిరాలలో స్వీకరించే దరఖాస్తులను 45 రోజులలో పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా మీతో స్టాలిన్ నినాదాన్ని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా స్వచ్ఛం సేవకులు లక్ష మంది ద్వారా ఇంటింటా దరఖాస్తులు, సమాచార బుక్ లెట్లను సోమవారం నుంచి పంపిణి చేయడానికి నిర్ణయించారు.