
సూపర్‌మ్యాన్
11న తెరపైకి
తమిళసినిమా: సూపర్‌మ్యాన్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఒక పెద్ద ఆశ్చర్యం. ఇంతకు ముందు వచ్చిన సూపర్‌మ్యాన్ చిత్రాలు, సీరియళ్లు ఎంతగా ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా తాజాగా మరో సూపర్‌మ్యాన్ ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. డీసీ.స్టూడియోస్,ట్రోల్ కోర్ట్ ఎంటర్‌టెయిన్‌మెంట్, ది సఫ్రాన్ కంపెనీ కలిసి నిర్మించిన తాజా హాలీవుడ్ చిత్రం ఇది. జేమ్స్‌గన్ కథ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్స్‌వెట్, రేచ్చల్ బ్రోస్నాహన్, నికోలస్ హౌల్ట్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ తనకు సూపర్‌మ్యాన్, సూపర్‌గర్ల్ వంటి ఇతి వృత్తాలతో కూడిన కథలు అంటే చాలా ఇష్టం అన్నారు. తాను చిన్నప్పుడు సూపర్‌మ్యాన్ కామిక్స్ కథలను ఎక్కువగా చదివేవాడినని చెప్పారు. దీంతో ఈ సూపర్‌మ్యాన్ చిత్రాన్ని తనదైన స్టైల్‌లో తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. దేశ విదేశాల్లో జరిగే అన్యాయాలపై తీవ్రంగా స్పంధిస్తూ వాటిని అరికట్టే ప్రయత్నం చేసే సూపర్‌మ్యాన్‌లో దయ కరుణ, మానవీయత వంటి గుణాలు ఉంటాయన్నారు. తన శక్తిని దేశ ప్రజల కోసం ఉపయోగించాలని భావించే గొప్ప వ్యక్తిత్వం కలిన మనిషి సూపర్‌మ్యాన్ అని పేర్కొన్నారు. ఇందులో సూపర్‌మ్యాన్ క్లార్క్,కెంట్‌గా ద్విపాత్రయంలో కనిపిస్తాడని చెప్పారు. అతన్ని అంతం చేయడానికి దుర్మార్గుడు, మోసగాడు ,అత్యంత ధనవంతుడు అయిన లెక్స్ తూథర్ యత్నిస్తాడన్నారు. అతనిని సూపర్‌మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు ? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఆధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన చిత్రం సూపర్‌మ్యాన్ అని దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని భారతదేశంలో వార్నర్‌బ్రదర్స్ సంస్థ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లం భాషల్లో 3డీ, ఇమ్యాక్స్ 3డీ ఫార్మెట్‌లో ఈ నెల 11 తేదీన విడుదల చేయనుంది.