
ఆమ్‌స్ట్రాంగ్ హత్యకు ఏడాది
● ప్రతీకార హత్యలను నివారించడానికి పోలీసుల హైఅలర్ట్
కొరుక్కుపేట: బహుజన సమాజ్‌వాద్ పార్టీ రాష్ట్ర ఽఅధ్యక్షులు ఆమ్‌స్ట్రాంగ్ ను గత ఏడాది జూలై 5న దుండగులు నరికిచంపారు. ఈ హత్యకు ఏడాది కావొస్తుంది. దీంతో ఆ హత్యకు ప్రతీకార హత్యలను నివారించడానికి చైన్నెలో పోలీసులు హై అలర్ట్ చేశారు. ఇప్పటికే ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న తిరువెంగడం అనే రౌడీని పోలీసులు కాల్చి చంపారు. హత్య కేసులో ప్రమేయం ఉన్న పులియాన్‌తోపు చెందిన దాదా నాగేంద్రన్‌తో సహా 30 మందిని అరెస్టు చేసి జైలులోపెట్టారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి దోషులను చట్టం ముందుకు తీసుకురావడానికి చర్యలు కూడా ముమ్మరం చేయబడ్డారు. ఆమ్‌స్ట్రాంగ్ హత్య ఘటన ప్రస్తుతం అతని మద్దతుదారులలో తీవ్ర కలకలం రేపుతోంది. ఫలితంగా ప్రతీకార చర్యలు జరగకుండా పోలీసులు తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఈ విషయంలో పరారీలో ఉన్న కొంతమంది రౌడీలను పోలీసులు పట్టుకునేందుకు చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు.
పీఎంకే నుంచి అరుల్‌కు ఉద్వాసన
●అన్బుమణి ప్రకటన
సాక్షి, చైన్నె : పీఎంకే నుంచి ఎమ్మెల్యే అరుల్‌కు ఉద్వాసన పలుకుతూ అన్బుమణి రాందాసు బుధవారం ప్రత్యేక ప్రకటన చేశారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య జరుగుతున్న అధ్యక్ష వార్ గురించి తెలిసిందే. అన్బుమణి మద్దతు దారులను తొలగిస్తూ రాందాసు ముందుకెళ్తున్నారు. అదే సమయంలో రాందాసు తొలగించిన వారికి అన్బుమణి మళ్లీ పదవులు కల్పిస్తూ , తానే అధ్యక్షుడ్ని అంటూ ముందడుగు వేస్తున్నారు. తండ్రి, తనయుడి మధ్య జరుగుతున్న ఈ అధికార సమరంలో ముఖ్య నేతలు నలిగి పోతున్నారు. తాజాగా అన్బుమణి కి వ్యతిరేకంగా సేలంకు చెందిన జిల్లా నేత, ఎమ్మెల్యే అరుల్ తీవ్రంగా ఆరోపణల ప్రశ్నలను సందించారు. అన్బుమణి మద్దతు దారుల రూపంలో రాందాసుకు ప్రాణ హానీ ఉందని ఆరోపణలు చేశారు. దీనిని అన్బుమణి తీవ్రంగానే పరిగణించారు. ఇన్నాళ్లు పార్టీ నుంచి తనతో ఉన్న వారిని రాందాసు తొలగిస్తూ వస్తే, తాజాగా రాందాసుకు అనుకూలంగా, తనకు వ్యతిరేకంగా స్పందించిన ఎమ్మెల్యే అరుల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం మొదలు అన్ని పదువుల నుంచి తొలగిస్తున్నట్టు అన్బుమణి ప్రకటించడం చర్చకు దారి తీసింది. రాందాసు, అన్బుమని మధ్య జరుగుతున్న సమరంలో తాజాగా ఎమ్మెల్యే అరుల్ బలి కావడంతో ఆయన మద్దతు దారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, అరుల్‌ను తొలగించే అధికారం అన్బుమణికి లేదంటూ రాందాసు స్పష్టం చేశారు. పీఎంకేలో అరుల్ కొనసాగుతారని తేల్చిచెప్పారు.
నామినేటెడ్ పదువులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, చైన్నె: దివ్యాంగులకు స్థానిక సంస్థలో నామినేటెడ్ పదవులను కేటాయించడమే లక్ష్యంగా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్రంలో పంచాయతీలు, పట్టణ పంచాయతీలు, తదితర స్థానిక సంస్థలలో ఒక స్థానం దివ్యాంగులకు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం తె లిసిందే. ఎన్నికలు లేకుండా వీరిని ఏక గ్రీవంగానామినేటెడ్ రూపంలో ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఇందుకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆయా స్థానిక సంస్థలలో ఈ నామినేటెడ్ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆశావహులు, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పిలుపు నిచ్చింది. ఈ దరఖాస్తులు చేసుకునే వారికి కొన్ని మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. ఆయా స్థానిక సంస్థల పరిధిలోని కార్యాలయాలు, జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు.
ఏరోస్పేస్ సెజ్ సౌకర్యంతో బలోపేతం
సాక్షి, చైన్నె : ఏరో స్పేస్ సెజ్ సౌకర్యం ఆవిష్కరణతో దేశ రక్షణ, విమానాయన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పునాది వేశామని బీఈఎంఎల్ చైర్మన్ శాంతను రాయ్ తెలిపారు. బెంగళూరులోని కేఐఏడీబీ , ఏరో స్పెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో కొత్తగా తాము నిర్మించిన అత్యాధునిక సౌకార్యం గురించి బుధవారం స్థానికంగా ఆయన వివరించారు. ఏరో స్పెస్ ఆశయాలను బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక చర్యలలో భాగంగా ఈ సెజ్‌లో 1.15 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి పునాది వేశామని వివరించారు. బీఈఎంఎల్ ప్రస్తుతం ఏరో స్పేస్ సెజ్‌లో మొత్తం 25 ఎకరాల స్థలాన్ని కలిగి ఉందని, దీనిని వేగంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ, విమానయాన రంగాలకు అనుగుణంగా ఒక శక్తివంతంగా తీర్చిదిద్దాలన్నసంకల్పంతో ఉన్నామని తెలిపారు. ఏరో స్పేస్ సెజ్‌ను దేశ విమానయాన, రక్షణ రంగాలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చేందుకు తమ మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు.