
జోరుగా డీఎంకే సభ్యత్వ నమోదు
మంత్రి దురై మురుగన్
వేలూరు: ఒకే తాటిపై తమిళనాడు అనే పథకం కింద డీఎంకే సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసి, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు సభ్యత్వ నమోదు చేపట్టాలని మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే పార్టీ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, సిద్ధాంతాలతో కూడిన పార్టీగా ఉందని, ప్రజా పోరాటం కోసమే ఈ పార్టీని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పథకాన్ని సీఎం స్టాలిన్ చైన్నెలోని సచివాలయంలో ప్రారంభించారన్నారు. దీంతోనే వేలూరు ఉమ్మడి జిల్లాలోనూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. తమిళనాడులోని ప్రతి కుటుంబంలోని సభ్యులను కలిసి ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గత నాలుగేళ్లలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. అయితే రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించక పోవడం సరికాదన్నారు. డీఎంకే ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. అంతకుముందు మంత్రి దురై మురుగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.