
మతసామరస్యానికి ప్రతీక మొహర్రం
నాయుడుపేటటౌన్: మొహర్రం పండుగను పురస్కరించుకుని ముస్లింలు, హిందువులు పీర్ల పండుగ వేడుకల్లో పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. పట్టణంలోని గరిడివీధిలోని హజరత్ మౌలాలీ తాలీంఖానా వద్ద మంగళవారం రాత్రి పీర్ల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలాలి తాలీంఖానా యువజన కమిటీ సభ్యులు, మత పెద్దలు గరిడీలో పీర్లు ప్రతిష్టించిన చోట ఫాతేహాలు జరిపారు.ముస్లింలు ఇళ్ల నుంచి జెండాలను ఊరేగింపుగా తీసుకొచ్చి తాలీంఖానా వద్ద ప్రతిష్టించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి మౌలాలి పంజా(పీర్లు)ను గుర్రంపై ప్రతిష్టించి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. పంజా ఊరేగింపులో పిల్లల పులివేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తీన్ మార్ బ్యాండు మేళాలు, డప్పు కళాకారులతో యువత కోలహాలం చేస్తు పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు.