
ఆడికృత్తికకు విస్తృత ఏర్పాట్లు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 16న ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్లకు సంబంధించి ఆర్డీఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 14 ఆడి అశ్వినితో ఆడికృత్తిక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 16న ఆడికృత్తికతో పాటు తొలిరోజు తెప్పోత్సవం నిర్వహిస్తారు. వేడుకల్లో లక్షలాది మంది భక్తులు కావళ్లతో తిరుత్తణి కొండకు పోటెత్తనున్న క్రమంలో సౌకర్యాలకు సంబంధించి అధికారుల స్థాయి సమీక్ష ఆలయ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, డీఎస్పీ కందన్, తహసీల్దారు మలర్‌వియి సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా ఆడికృత్తిక ఏర్పాట్లకు సంబందించి అధికారులు వివరించారు. వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసి హిందూ దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని అధికారులకు ఆర్డీఓ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, హైవే ఏఈ అరుల్‌రాజ్, సీఐ యదియరసన్ తదితరులు పాల్గొన్నారు.
దుకాణాలు తొలగింపు
తిరుత్తణి కొండ ఆలయంలో భక్తులకు వసతులు మెరుగుపరిచే విధంగా రూ. 85 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కొండ ఆలయంలోని అన్నదాన భవనం విస్తరించేందుకు వీలుగా, మాడ వీధికి సమీపంలో పువ్వులు, పుష్పాలు, పూజా సామాగ్రి దుకాణాలు తొలగించారు. ఆ స్థానంలో అన్నదాన భవనం నిర్మించనున్నారు. పూజా సామాగ్రి, పండ్లు, పువ్వుల దుకాణాల కోసం పార్కింగ్ ప్రాంతంలో నూతనంగా దుకాణాలు నిర్మించనున్నారు. అలాగే కార్తికేయన్ ఆలయ వసతి గృహం పాత భవనాలు తొలగించి ఆ స్థానంలో నూతన భవనం నిర్మాణం కోసం దుకాణాలు తొలగించి పాత భవనం కూల్చివేయనున్నారు.

ఆడికృత్తికకు విస్తృత ఏర్పాట్లు