
మార్గన్ చాలా ప్రత్యేకం
తమిళసినిమా: విజయ్‌ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యి, ఆ తరువాత కథానాయకుడు, ఎడిటర్, దర్శకుడు, నిర్మాత అంటూ పలు శాఖలలో సత్తా చాటుకుంటున్నారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించి తన విజయ్ ఆంటోని ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించి సంగీతాన్ని అందించిన చిత్రం మార్గన్. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ద్వారా ఎడిటర్ లియో జాన్‌పాల్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అజయ్ దిషాన్,ప్రధాన పాత్రను పోషించిన ఇందులో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడ, బ్రిందా సాగా, వినోద్‌సాగర్, దీప్సీక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం గత నెల 27న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మంగళవారం ఉదయం చైన్నెలో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్‌ఆంటోని మాట్లాడుతూ తాను ఇంతకు ముందు చాలా సక్సెస్‌ఫుల్ చిత్రాలతో పాటు పలు ప్లాప్ చిత్రాలలోనూ నటించానని, అయితే మార్గన్ చిత్రం మాత్రం తనకు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా ఎడిటర్ లిమో జాన్ పాల్‌ను దర్శకుడిగానూ, తన చెల్లెలి కొడుకు అజయ్ దిషాన్‌ను యువ హీరోగానూ పరిచయం చేయడం సంతోషం అన్నారు. ఏ చిత్రం అయినా హీరో వల్లే ఆడదన్నారు. అది దేవుడు వచ్చి నటించినా ఆడదన్నారు. దర్శకత్వం, కథ సరిగా లేకపోతే ఏ చిత్రం సక్సెస్ కాదన్నారు. ఈ రెండు సరిగా ఉంటేనే విజయవంతం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అందువల్ల ఏ చిత్రం సక్సెస్ అయినా,ఆ క్రెడిక్ట్‌ను దర్శకుడే చెందుతుందన్నారు. అలా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడటానికి మొదటి కారణం దర్శకుడు లియో జాన్ పాల్‌నేనని పేర్కొన్నారు. ఆయన తన పనిని నిజాయితీగా చేశారన్నారు. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. ఇకపోతే ఇంతకు ముందు తాను ఎన్ని చిత్రాల్లో నటించినా, ఇకపై ఎన్ని చిత్రాల్లో నటించనున్నా, పిచ్చైక్కారన్ చిత్రానికి సమంగా ఏదీ ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.దర్శకుడు శశి ఆ చిత్ర కథ చెప్పగానే ఏడ్చేశానన్నారు.ఆ చిత్రాన్ని శశి దర్శకత్వంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తదుపరి తాను నటిస్తున్న శక్తి తిరుమగన్ విడుదల కానుందనీ, ప్రస్తుతం లాయర్ చిత్రంలో నటిస్తున్నట్లు విజయ్ ఆంటోని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసరి గణేశ్, ధనుంజయన్, శుశీంద్రన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.