
మున్సిపాలిటీలో చిన్నారుల భద్రతకు కమిటీలు
తిరువళ్లూరు: చిన్నపిల్లల భద్రత, బాల్య వివాహలను నిరోధించడానికి మున్సిపాలిటీలోని 27 వార్డులోనూ ప్రత్యేక కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఏర్పాటు చేయడానికి కౌన్సిలర్లు సహకరించాలని కోర్డినేటర్ మలర్‌విళి సూచించారు. తిరువళ్లూరు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం సోమవారం చైర్‌పర్సన్ ఉదయమలర్‌పాండ్యన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతోపాటు గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలను చైర్‌పర్సన్ పరిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల సన్మానించడం శుభపరిణామని, ఇదే విధానాన్ని భవిషత్తులోనూ కొనసాగించాలని కౌన్సిలర్ జాన్ సూచించారు. అనంతరం చిన్నపిల్లల సంరక్షణ శాఖ అధికారి మలర్‌విళీ మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ కౌన్సిలర్లు సభ్యులుగా ఉండేలా చిన్నపిల్లల భద్రత, బాల్యవివాహాల నిషేధం, వెట్టిచాకిరిపై అధికారులకు సమాచారం ఇవ్వడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అరుణజైకృష్ణ, జాన్,ఽథామస్, అయూబ్‌అలీ, సుమిత్రా వెంకటేషన్, శాంతిగోపి, వసంతి వేలాయుధం, ప్రభాకరన్, శానీటరి అధికారి మోహన్ పాల్గొన్నారు.