
ఆస్కాలో జ్వలించిన.. ‘మెంబర్స్ వాయిస్’!
● ఎన్నికలలో జయ కేతనం ● అధ్యక్షుడిగా జి. శశిధర్‌రెడ్ది ఎన్నిక
సాక్షి, చైన్నె: ఆస్కా ఎన్నికలలో ‘మెంబర్స్ వాయిస్’ గళం జ్వలించింది. ఈ ప్యానెల్ సంపూర్ణ ఆధిక్యంతో ఆస్కాను గుప్పెట్లోకి తీసుకుంది. ఈ ప్యానెల్ తరపున ఆస్కా అధ్యక్షుడిగా జీ శశిధర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వివరాలు.. తెలుగువారికి కేరాఫ్ అడ్రస్సుగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా టీనగర్‌లో ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్(ఆస్కా) విరాజిల్లుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలు, కోర్టు కేసులతో నలుగుతూ వచ్చిన ఆస్కా కార్యవర్గం ఎన్నికకు ఎట్టకేలకు ఇటీవల మోక్షం లభించింది. దీంతో జి. శశిధర్‌రెడ్డి సారథ్యంలో ఈ ఎన్నికలలో మెంబర్స్ వాయిస్ పేరిట తొలుత ఓ ప్యానెల్ పోటీకి దిగింది. ఆ తర్వాత తాము సైతం అంటూ ఎం. ప్రతాప్‌రెడ్డి సారథ్యంలోని ట్రెండ్ సెట్టర్స్ జట్టు రంగంలోకి దిగింది. ఈ రెండు ప్యానెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆదివారం ఆస్కా ఆవరణలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి కోశాధికారి, సాంస్కృతిక కార్యదర్శి పదవులతో పాటూ 9 మంది కార్యవర్గ సభ్యులు, 9 మంది ట్రస్టీల ఎన్నిక నిమిత్తం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిటీ చైర్మన్ టీవీ కృష్ణకుమార్, సభ్యులు ఎ. వెంకటరెడ్డి, ఎంఆర్ రవికుమార్‌ల పర్యవేక్షణల ఈ ప్రక్రియ ప్రశాంతంగా విజయవంతమైంది.
మెంబర్స్ వాయిస్ జయకేతనం..
ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి సోమవారం వేకువజాము వరకు ఫలితాల లెక్కింపు జరిగింది. తుది ఫలితాలను ఉదయం 6 గంటలకు ప్రకటించారు. ఈ ఎన్నికలలో మెంబర్స్ వాయిస్ జయ కేతనం ఎగుర వేసింది. అధ్యక్ష పదవికి ట్రెండ్ సెట్టర్స్ తరపున పోటీ చేసిన ఎం. ప్రతాప్‌రెడ్డికి 450 ఓట్లు రాగా, మెంబర్స్ వాయిస్ తరపున పోటీ చేసిన జి. శశిధర్‌రెడ్డి 668 ఓట్లు వచ్చాయి. 218 ఓట్లతో జి. శశిధర్‌రెడ్డి ఆస్కా అధ్యక్ష పగ్గాలను చేజిక్కించుకున్నారు. మెంబర్స్ వాయిస్ ప్యానెల్ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన వై. రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా పోటీ చేసిన మాదాల వెంకట సుబ్బారావు, కోశాధికారిగా పోటీ చేసిన ఎల్. శాంతకుమార్, కల్చరల్ సెక్రటరీగా పోటీ చేసిన సినీ నటుడు భాను చందర్ విజయకేతనం ఎగుర వేశారు. అలాగే కమిటీ సభ్యులుగా ఇదే ప్యానెల్‌కు చెందిన ఎం. చలపతి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, రవిచంద్రన్, ఎస్‌కే దుర్గా ప్రసాద్, రమేష్‌రెడ్డి, టీ రాజేష్, జే. మదనగోపాల్‌రావు, ఎస్‌పీ శ్రీనివాస్‌లు గెలిచారు. ఈ ప్యానెల్‌కు చెందిన సభ్యుడు పీ ప్రేమ్‌కుమార్ ఓటమి పాలు కాగా, ట్రెండ్ సెట్టర్స్ తరపున పోటీ చేసిన సభ్యుడు గోపాల్ కృష్ణారెడ్డి గెలిచారు. ట్రస్టీలుగా కోటరెడ్డి వేమిరెడ్డి, వి. విజయేంద్ర రావు, ఎం. శ్రీనివాసరావు, పి. సంతోష్‌కుమార్, బీవీఎస్ కోటేశ్వరరావు, మనోహర్‌రెడ్డి, ఎన్‌ఎన్ భిక్షం, వీ బాలాజీ, వీ. ప్రశాంత్ విజయఢంకా మోగించారు. ఆస్కాకు ఇది వరకు నరసారెడ్డి, ఆదిశేషయ్య, సుబ్బారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా అధ్యక్ష ఎన్నికలలో విజయ కేతనంతో ఆస్కా పగ్గాలను జి. శశిధర్‌రెడ్డి చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
నమ్మకంతో ఓట్ల వేసి గెలిపించారు..
తన విజయానికి స్థానిక సభ్యులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి శ్రమ కోర్చి తరలివచ్చి ఓట్లు వేసిన సభ్యులు కూడా కారణం అంటూ అందరికీ శశిధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద నమ్మకంతో అధ్యక్ష పదవికి ఓట్లు వేసి గెలిపించారని, తమ ప్యానెల్‌కు సంపూర్ణ ఆధిక్యాన్ని అందించారని వ్యాఖ్యానించారు. ఆస్కా అభివృద్ధికి ఇచ్చిన వాగ్దానాలన్నీ త్వరితగతిన అమల్లోకి తీసుకొస్తానన్నారు. క్రమంతప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తామని, యువత, మహిళలకు సబ్ కమిటీలలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సౌకర్యాలను మెరుగు పరచడమే కాదు, అన్నింటా పారదర్శకతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. తనతో పాటూ తన ప్యానెల్ విజయానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, అందరి నమ్మకానికి మరింత బలం చేకూర్చే విధంగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు.

ఆస్కాలో జ్వలించిన.. ‘మెంబర్స్ వాయిస్’!