మై డియర్‌ వెంకటేశం.. నాటకం చూద్దాం రావోయ్‌ | Sakshi
Sakshi News home page

మై డియర్‌ వెంకటేశం.. నాటకం చూద్దాం రావోయ్‌

Published Wed, Mar 27 2024 12:55 AM

- - Sakshi

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని సుమిత్ర కళాసమితి సభ్యులు ఓ అపూర్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు. అంతకంటే ముందు బుధవారం కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి టికెట్‌ కూడా రూ.50గా నిర్ణయించారు. ఈ నాటకాన్ని 1892లో గురజాడ అప్పారావు రచించారు. ఇప్పటికీ ఆ రచనలోని సొగసును ఆస్వాదిస్తూనే ఉన్నారు. నాటకంలోని ప్రధాన పాత్రఽలైన గిరీశంగా ప్రధాన విజయరామ్‌, మధురవాణిగా కేశిరెడ్డి రాజేశ్వరి, బుచ్చెమ్మగా సునీతారాణి, రామప్పంతులుగా రేజేటి బోసుబాబు, వెంకటేశంగా మహేష్‌ తదితర పాత్రలు మరికొందరు ధరిస్తున్నారు. ఈ నాటకాన్ని దర్శకత్వ బాధ్యతలు ఇప్పిలి శంకరశర్మ నిర్వహిస్తున్నారు.

28 నుంచి నాటిక పోటీలు

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఈనెల 28నుంచి నిర్వహిస్తున్నారు. 28న కొలకలూరు, సాయిఆర్ట్స్‌ వారిచే ‘కౌసల్యా సుప్రజా రామా’ నాటిక, కాకినాడ, సాయి కార్తీక్‌ క్రియోషన్స్‌ వారి ‘ఎడారిలో వాన చినుకు’ నాటికలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. 29న హైదరాబాద్‌కు చెందిన గోవాడా క్రియేషన్స్‌ వారి ‘మూల్యం’ నాటిక, కాకినాడ శృంగార వల్లభ ఆర్ట్స్‌ వారి ‘కబ్జా’ నాటిక, 30న గుంటూరువారి అభియన ఆర్ట్స్‌ వారిచే ‘ఇంద్రప్రస్థం’ నాటిక కొప్పోలుకు చెందిన పండు క్రియేషన్స్‌ వారిచే ‘పక్కంటి మొగుడు’ నాటిక ప్రదర్శన జరుగుతాయి.

నాటిక పోటీలు విజయవంతం చేయండి

బాపూజీ కళామందిర్‌లో నిర్వహించే నాటక పోటీలను విజయవంతం చేయాలి. ఆహ్వాన నాటిక పోటీలను ప్రతి ఒక్కరూ తిలకించాలి.

– మండవిల్లి రవి, సుమిత్రా కళాసమితి ఉపాధ్యక్షులు

మీరు పుష్పాలు, రాకీభాయ్‌లు చూసుంటారు. రామ్‌, భీమ్‌ వంటి క్యారెక్టర్లు తెరపై చూసి విజిళ్లు వేసి ఉంటారు. గిరీశాన్ని ఎప్పుడైనా రంగస్థలంపై చూశారా..? మధురవాణి అందంగా డైలాగులు చెబుతుండగా విన్నారా..? పది పన్నెండు వందలకు కూతుళ్లను అమ్ముకునే అగ్నిహోత్రావధానులు పాత్రను ఎన్నడైనా పరిశీలించారా..? అదే డబ్బుకు బాలికలను కొని పెళ్లాలుగా చేసుకునే లుబ్ధావధానులు అనే ముసలివాడి గురించి ఏనాడైనా తెలుసుకున్నారా..? కన్యాశుల్కం పేరు తప్ప నాటకాన్ని ఎప్పుడైనా చూశారా..? ఇప్పుడు ఆ మహత్తర అవకాశం వచ్చింది. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో నేటి సాయంత్రం ఏడు గంటలకు ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. వందేళ్ల నాటి కాలాన్ని మన ముందుంచనున్నారు.

నేడు శ్రీకాకుళంలో ‘కన్యాశుల్కం’ నాటిక ప్రదర్శన

ఏర్పాట్లు చేసిన సుమిత్రా కళా సమితి సభ్యులు

రూ.50 టికెట్‌తో నాటిక చూసే అవకాశం

28 నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

1/1

Advertisement
Advertisement