
అరసవల్లిలో డీసీఎంఎస్ ప్రధాన కార్యాలయం
ఆర్థిక పరిపుష్టి సాధించిన డీసీఎంఎస్
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మారిన దశ
● సంస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టిన
పాలకవర్గం
● ఇప్పటి వరకు రూ.34 లక్షల అదనపు ఆదాయం ఆర్జన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆర్థిక పరిపుష్టి సాధించింది. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలే ఇచ్చుకోలేని పరిస్థితి నుంచి నేడు అదనపు ఆదాయం ఆర్జించే స్థితికి చేరుకుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పడిన పాలకవర్గం, అధికార యంత్రాంగం కృషితో ఇది సాధ్యమైందని కచ్చితంగా చెప్పవచ్చు. గతంలో కూడా అధికారులు, ఉద్యోగులున్నా సొంతంగా ఆదాయం పెంచుకునే ప్రణాళికలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. డీసీఎంఎస్ వివిధ ప్రభుత్వ సంస్థలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ట్ మాత్రమే చేసేది. అది కూడా సంబంధిత అధికారులపై ఆధారపడి ఉండేది. ఆ వచ్చిన కాంట్రాక్ట్‌లను సైతం సబ్ కాంట్రాక్ట్‌లుగా ఇచ్చేసి ప్రేక్షక పాత్ర పోషించేది. పాలకవర్గ పెద్దల సన్నిహితులకు ఆ కాంట్రాక్ట్‌లిచ్చేసి, వారిచ్చే కొద్దిపాటి కమీషన్లతో సంతృప్తి చెందేది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోయేది కాదు. ఉద్యోగుల జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్లకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతను తీసుకుంది. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వమిచ్చే కమిషన్‌పై ఆధారపడాల్సి వచ్చేది. దీనివల్ల ఉద్యోగుల జీత భత్యాల సమస్య కొంత పరిష్కారమైనా సొంతంగా ఆదాయం సమకూర్చుకునే యత్నాలు జరగలేదు.
చురుగ్గా పాలకవర్గం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైన పాలకవర్గం చురుగ్గా పనిచేస్తోంది. ఆదాయం సమకూర్చే మార్గాలను ఆన్వేషించింది. తమ కాళ్లపై నిలబడేలా సొసైటీని ముందుకు తీసుకెళ్లింది. ఎవరిపైనో ఆధారపడకుండా సొంతంగా వ్యాపార లావాదేవీలు సాగించే ప్రయత్నం చేసింది. దీంతో దాదాపు 34లక్షల అదనపు ఆదాయాన్ని సంపాదించింది. సంబంధిత ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా ఆదాయ సమపార్జన చేసింది. ప్రస్తుతం 25మంది రెగ్యులర్, తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుండగా వారంతా ఇప్పుడు ఆనందంగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో జీతాలు ఎప్పుడు వస్తాయో అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడా భయం పోవడమే కాకుండా సంస్థ ఆర్థికంగా పరిపుష్టి సాధించడంతో భవిష్యత్‌పై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయాయి.
ఆక్రమణల తొలగింపుపై దృష్టి
గతంలో పాలకవర్గాలు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో చాలావరకు డీసీఎంఎస్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆక్రమణలు తొలగించి, వాటిని ఆదాయ సంపాదనకు వినియోగించారు. శిథిలావస్థకు చేరుకున్న గొడౌన్‌లు, షాపులకు సైతం మరమ్మతులు చేయించి అద్దెకివ్వడంతో సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతోంది.
తీసుకున్న చర్యల్లో కొన్ని..
● అరసవల్లిలో శిథిలావస్థకు చేరిన ఆరు గొడౌన్ల ప్రాంగణంలో ఆక్రమణలు తొలగించారు. ప్రహరీ నిర్మించి, గొడౌన్‌లకు మరమ్మతులు చేసి సరుకు నిల్వ చేసుకునేందుకు అద్దెకు ఇచ్చారు. వీటి ద్వారా రూ.6లక్షల 24వేల మేర అదనపు ఆదాయం సమకూరింది. ఇదే స్థలంలో 867 స్క్వేర్ మీటర్ల స్థలాన్ని పెట్రోలు బంకు పెట్టేందుకు హెచ్‌పీసీఎల్‌కు లీజుకిచ్చారు. దీని ద్వారా నెలకి అద్దెగా రూ.76,700 అదనపు ఆదాయం వస్తోంది.
● శ్రీకాకుళం కత్తెరవీధిలో ఆక్రమణకు గురైన 37 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకుని సూపర్ మార్కెట్ నిర్మించి, ప్రారంభించారు. దీని ద్వారా రూ.60వేల వరకు అదనపు ఆదాయం వస్తోంది.
● ఆమదాలవలసలో నిరుపయోగంగా ఉన్న స్థలంలో 13 చిన్న చిన్న గదులతో నిర్మాణం చేసి, వ్యాపారులకు, వృత్తిదారులకు అద్దెకు ఇచ్చారు. వీటి ద్వారా రూ.3లక్షల 12వేల అదనపు ఆదాయం వస్తోంది.
● ఉమ్మడి జిల్లాలోని వీరఘట్టంలో శిథిలావస్థలో ఉన్న గొడౌన్‌కు రిపేర్లు చేసి, ఐదు చిన్న గొడౌన్లుగా మార్చి అద్దెకు ఇచ్చారు. వీటి ద్వారా రూ.9లక్షల 12వేల అదనపు ఆదాయం వస్తోంది.
● మెళియాపుట్టి మండలం చాపరలో ఆక్రమణకు గురైన డీసీఎంఎస్ షాపింగ్ కాంప్లెక్స్ వెనకభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు గొడౌన్‌లను అద్దెకిచ్చి రూ. 2లక్షల 22వేల అదనపు ఆదాయం సమకూర్చుకున్నారు.
● హిరమండలంలో గొడౌన్‌లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం ఆక్రమణకు గురైంది. దానిని స్వాధీనం చేసుకుని అద్దెకిచ్చారు. గొడౌన్లకు మరమ్మతులు చేయించి అద్దెకిచ్చారు. వీటి ద్వారా రూ.లక్షా 92 వేల మేర అదనపు ఆదాయం వస్తోంది.
● పాతపట్నం శివశంకర్ కాలనీలో 15 సెంట్లు, జమ్ము(నరసన్నపేట)లో 76 సెంట్లు, రణస్థలం, టెక్కలిలో ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆక్రమణదారులు కొందరు కోర్టుకెళ్లడంతో న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు.
● పొందూరు, రణస్థలం, పాలకొండ, మెళియాపుట్టి, ఆమదాలవలస, వీరఘట్టంలో ఉన్న మరికొన్ని ఆస్తులను సర్వే చేసి, రెవెన్యూ పత్రాలు పొంది, ఆ ఆస్తుల రక్షణతో పాటు వాటిని వ్యాపార కేంద్రాలను మార్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు
● గతంలో కొనసాగుతున్న సంప్రదాయంగా ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ వసతి గృహాలకు, అంగన్‌వాడీలకు ఆహార దినుసులు, స్టేషనరీ సామగ్రి సరఫరా చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా నిర్వహిస్తున్నారు.
భవిష్యత్ కార్యాచరణ..
● మెళియాపుట్టి, పాలకొండ, హిరమండలంలోని డీసీఎంఎస్ స్థలాలను పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అద్దెకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
● పొందూరు గొడౌన్ వద్ద ఐదారు షాపుల నిర్మించి అద్దెకిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
● కత్తెర వీధిలో షాపులు నిర్మించి, వాటిని అద్దెకిచ్చి ఆదాయం సమకూర్చుకోనున్నారు.
● టెక్కలిలో 2.23ఎకరాల స్థలాన్ని షాపింగ్ మాల్‌కు అద్దెకివ్వడం ద్వారా లక్షలాది రూపాయల అదనపు ఆదాయం రానుంది.
● డీసీఎంఎస్ ఆఫీస్ వెనక భాగాన ఉన్న స్థలాన్ని ప్రైవేటు స్కూల్‌కు అద్దెకిచ్చే ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా రూ. 30వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
● టీడీపీ హయాంలో డీసీఎంఎస్‌లో జీతాలిచ్చుకోలేని పరిస్థితి
● కొన్ని కాంట్రాక్ట్‌లపైనే ఆధారపడ్డ దుస్థితి
● ఆక్రమణకు గురైన సంస్థ ఆస్తులు
● నిరుపయోగంగా, శిథిలావస్థకు గురైన గొడౌన్లు, భవనాలు
● వైఎస్సార్ సీపీ పాలనలో మెరుగైన సంస్థ ఆదాయం
● ఆక్రమిత స్థలాలపై ఉక్కుపాదం..
ఎక్కడికక్కడ స్వాధీనం
● ఆదాయం పెంచుకునేందుకు పక్కాగా ప్రణాళికలు
● స్థలాల్లో సూపర్ మార్కెట్, గోదాములు, షాపుల
నిర్మాణం
● అద్దెకిచ్చి అదనపు ఆదాయం సముపార్జన
లాభాల బాటలో ముందుకు..
గడ్డు పరిస్థితిని అధిగమించి, సంస్థను లాభాల బాటలో పయనించేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు, స్పీకర్, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో సంస్థ ఆస్తులను రక్షించడమే కాకుండా వాటి ద్వారా ఆదనపు ఆదాయం తీసుకురావడంలో విజయవంతమయ్యాం. సంస్థ ప్రస్తుతం ఆర్ధికంగా నిలబడింది. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందనుంది. –సల్లా సుగుణ దేవరాజ్, చైర్‌పర్సన్, డీసీఎంఎస్


