
Bhuvaneswar Repalce By Any Of These 3 Bowlers.. టి20 క్రికెట్‌లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో.. బౌలింగ్ కూడా అంతే అవసరం. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియాకు ఎంపికైన 15 మంది ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు. బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ అక్టోబరు 10వరకు జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఆటగాళ్లు చేసే ప్రదర్శన బట్టి వారి స్థానాలు మారిపోయే అవకాశం ఉందంటూ సెలక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్
ఇప్పటికే బ్యాటింగ్ విభాగంలో కీలకంగా భావిస్తున్న మిడిలార్డర్‌లోఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఫామ్ పేలవంగా ఉండడంతో వారి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, మయాంక్ అగర్వాల్ లాంటి బ్యాటర్స్‌కు అవకాశం ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా బౌలింగ్ విభాగంలోనూ ఆ కలవరం మొదలైంది. బుమ్రా, షమీలకు తోడుగా ఎంపిక చేసిన భువనేశ్వర్ కుమార్ అనుకున్నంత ఫామ్ కనబరచడం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న భువీ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 8.53 ఎకానమీ రేటుతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు.
పేస్ బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటకీ అతని ఫిట్‌నెస్‌పై నమ్మకం లేదు. మ్యాచ్ జరిగేవరకు అతను బౌలింగ్ చేస్తాడా లేదా అనేది అనుమానమే. దీంతో భువీకి ప్రత్యామ్నాయంగా మరో పేస్ బౌలర్ అవసరం కనిపిస్తుంది. స్టాండ్ బై ప్లేయర్లలో శార్ధూల్ ఠాకూర్, దీపక్ చహర్ లాంటి నాణ్యమైన బౌలర్లు కనిపిస్తున్నప్పటికీ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌లాంటి బౌలర్లకు అవకాశమిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం.
దీపక్ చహర్:
వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం దీపక్ చహర్ ప్రత్యేకత. బ్యాటర్ పొరపాటున బంతి వదిలేశాడో క్లీన్ బౌల్డ్ అవడం ఖాయం. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరే దీపక్ ప్రస్తుతం ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రధాన బౌలర్‌గా వ్యవహరిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌కు సంబంధించి భువీ స్థానంలో సరిగ్గా సరిపోయే పేస్ బౌలర్‌గా దీపక్ కనిపిస్తున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించడంలో దీపక్ చహర్ స్పెషలిస్ట్. సీఎస్‌కే తరపున 10 మ్యాచ్‌లాడిన చహర్ 7.75 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు.అంతేగాక టీమిండియాకు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు.
చదవండి: Kohli-Rohit Rift: వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది
మహ్మద్ సిరాజ్:
టీమిండియా బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. సిరాజ్ కెరీర్‌లో ఆసీస్ పర్యటన ఒక టర్నింగ్ పాయింట్. అక్కడినుంచి అతను టీమిండియాలో కీలక బౌలర్‌గా మారిపోయాడు. కానీ ఎందుకనో టి20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికచేయలేదు. ప్రస్తుత ఫామ్ దృశ్యా సిరాజ్ సేవలు టీమిండియాకు చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది. టెస్టుల్లో స్థిరమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సిరాజ్ అవకాశమొస్తే టి20ల్లోనూ చెలరేగే సత్తా ఉన్నవాడే. తన చూపులతో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను భయపెట్టే సిరాజ్ ఆరంభ, డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు పరుగులు చేయకుండా అడ్డుపడుతూనే కీలక సమయంలో వికెట్లు తీయగలడు. ఇక ఐపీఎల్‌లో కోహ్లి సారధ్యంలోని ఆర్‌సీబీలో ఉన్న సిరాజ్‌పై కెప్టెన్ ఎంతో నమ్మకముంచాడు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లే తీసినప్పటికీ ఆర్‌సీబీ ప్రధాన బౌలర్‌గా కనిపిస్తున్నాడు.
ఆవేశ్ ఖాన్:
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్రస్తుతం ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్ వైవిధ్యమైన బౌలింగ్‌తో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు రాబట్టడం ఆవేశ్ ఖాన్ ప్రత్యేకత. అదే అతన్ని ఢిల్లీకి ప్రధాన బౌలర్‌ను చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7.55 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.
చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..?