భారత్‌తో వన్డే సిరీస్‌కు వేర్వేరుగా జట్టు ప్రకటన
తొలి మూడు మ్యాచ్‌లకు ఓ జట్టు
చివరి రెండు మ్యాచ్‌లకు మరొకటి
టెస్టు సిరీస్ సంసిద్ధతకు పెద్దపీట
వెల్లింగ్టన్: టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 4 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుండగా... దీంట్లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం ఒక జట్టును... తదుపరి రెండు మ్యాచ్‌ల కోసం పలు మార్పులతో మరో జట్టును ప్రకటించారు. చాన్నాళ్లుగా వన్డే జట్టుకు దూరమైన ఫిన్ అలెన్, ఫెర్గూసన్, సీఫెర్ట్ ఇందులో చోటు దక్కించుకోగా... గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.
వన్డేల తర్వాత భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుండడంతో... అందులో పాల్గొనే పలువురు ఆటగాళ్లకు చివరి రెండు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చి సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధం చేయనున్నారు. కెప్టెన్ సాంట్నర్, బ్రాస్‌వెల్, చాప్‌మన్, జాకబ్ డఫీ, విల్ యంగ్, టిక్నెర్ మాత్రమే అన్నీ మ్యాచ్‌లు ఆడనున్నారు. కాన్వే, హెన్రీ, జెమీసన్, లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్ తొలి మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... చివరి రెండు వన్డేలకు ఫిన్ అలెన్, క్రిస్టియన్ క్లార్క్, మ్యాట్ ఫిషర్, ఫెర్గూసన్, మిచ్ హే, నిక్ కెల్లీ, సీఫెర్ట్ కొత్తగా జట్టుతో చేరనున్నారు.
అలెన్, ఫెర్గూసన్, సీఫెర్ట్ 2023 తర్వాత తిరిగి వన్డే జట్టులోకి రావడం విశేషం. ఈ ఏడాది భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు... స్వదేశంలోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని భావిస్తోంది. ‘వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత్ వంటి అగ్రశ్రేణి జట్టుతో సిరీస్ ఎంతో ఉపయుక్తకరం. వరల్డ్‌కప్ సన్నాహాలకు ఇది బాగా ఉపయోగపడనుంది. చివరి రెండు వన్డేలకు ఏడుగురు ఇతర ప్లేయర్లను ఎంపిక చేశాం. అది మా బెంచ్ స్ట్రెంత్‌కు నిదర్శనం’ అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ వన్డే జట్టు (తొలి మూడు మ్యాచ్‌లకు): సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, రచిన్, యంగ్, డారిల్ మిచెల్, చాప్‌మన్, లాథమ్, బ్రాస్‌వెల్, ఫిలిప్స్, నాథన్ స్మిత్, జెమీసన్, డఫీ, టిక్నెర్, హెన్రీ.
చివరి రెండు వన్డేలకు: సాంట్నర్ (కెప్టెన్), అలెన్, సీఫెర్ట్, యంగ్, కెల్లీ, చాప్‌మన్, మిచ్ హే, బ్రాస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, ఫెర్గూసన్, ఫిషర్, డఫీ, టిక్నెర్.
ప్రత్యేక జెర్సీలో న్యూజిలాండ్ క్రికెటర్లు
టీమిండియాతో వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇరు దేశాల మధ్య క్రీడాబంధానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... తామర పువ్వులతో కూడిన ప్రత్యేక డిజైన్ జెర్సీని ప్లేయర్లు ధరించనున్నారు. ‘కోటాహిటాంగా’ పేరిట ఆవిష్కరించిన ఈ జెర్సీ ఇరు దేశాల సంస్కృతులను, క్రికెట్‌పై వాటికున్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. మన జాతీయ పుష్పం తామర పువ్వు, భారతీయ వాస్తుశిల్ప కల... న్యూజిలాండ్ సంస్కృతి సంప్రదాయాలు ఈ జెర్సీపై దర్శనమివ్వనున్నాయి. ఈ నెలాఖరులో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.


