ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడటం ఇష్టం: కోహ్లి | Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడటం ఇష్టం! రబడ అయితే..

Published Mon, Apr 15 2024 6:12 PM

IPL 2024: RCB Kohli Reveals 3 Bowlers He Loves Playing Against - Sakshi

ఐపీఎల్‌-2024లో విరాట్‌ కోహ్లి బ్యాట్‌ ఝులిపిస్తున్నా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కథ మాత్రం మారడం లేదు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

ఈ క్రమంలో సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలుపొందడం ఆర్సీబీకి అనివార్యంగా మారింది. విజయాల బాట పడితే గానీ ఈ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్‌ వరకైనా చేరుకునే అవకాశం ఉంటుంది. లేదంటే.. ‘‘వచ్చేసారి కప్‌ మనది’’ అంటూ ఆ జట్టు అభిమానులు సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ఇక ఇప్పటికే ఐదింట మూడు విజయాలతో సన్‌రైజర్స్‌ జోరు మీద ఉండగా.. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుండటం ఆర్సీబీకి సానుకూలాంశం. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో కోహ్లి ఆరు మ్యాచ్‌లలో కలిపి 319 పరుగులు చేశాడు.

తద్వారా ఆరెంజ్‌ క్యాప్‌ తన దగ్గరే పెట్టుకున్నాడు. కోహ్లి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113*) కూడా ఉండటం విశేషం. అయితే, టాపార్డర్‌లో ఓపెనర్‌ కోహ్లి ఒక్కడే రాణిస్తుండగా.. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ విఫలం కావడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. 

ఇక విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా పేరొందిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఇలా KGFలో కేవలం K మాత్రమే రాణిస్తుండగా.. మిలిగిన ఇద్దరు జట్టుకు పెద్దగా ఉపయోగపడకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు KGF త్రయం చిట్‌చాట్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో భాగంగా మాక్సీ.. విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి.. ‘‘ప్రత్యర్థి బౌలర్లలో ఎవరి బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడం అంటే నీకు బాగా ఇష్టం’’ అని అడిగాడు.

ఇందుకు బదులిస్తూ ఒక్కసారిగా పెద్దగా నవ్వేసిన కోహ్లి.. ముందుగా మాక్స్‌వెల్‌(స్పిన్‌) పేరు, ఆ తర్వాత ఆస్ట్రేలియాకే చెందిన జేమ్స్‌ ఫాల్కనర్‌(పేసర్‌) పేరును కూడా చెప్పాడు. ఇక మూడో బౌలర్‌గా కగిసో రబడ(సౌతాఫ్రికా పేసర్‌) పేరు చెప్పిన కోహ్లి.. అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడం చాలెంజింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక మాక్స్‌వెల్‌ తాను తరచుగా ఉపయోగించే మూడు హిందీ పదాలు ఇవేనంటూ.. ‘‘ఠీకై(మంచిది), షుక్రియా, చలో చలో’’ అని పేర్కొన్నాడు. 

చదవండి: BCCI: ఇకపై అలా చేస్తే భారీ జరిమానా.. ఐపీఎల్‌ జట్లకు వార్నింగ్‌!

Advertisement
 
Advertisement