IPL 2022- CSK: డుప్లెసిస్‌ స్థానంలో అతడే సరైనోడు: ఇర్ఫాన్‌ పఠాన్‌

IPL 2022: Irfan Pathan Backs India 36 Year Old Star As Faf Replacement In CSK - Sakshi

మరికొన్ని రోజుల్లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ ఆరంభం కానుంది. మార్చి 26న చెన్నై సూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌తో తాజా సీజన్‌ మొదలు కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీసులో తలమునకలై పోయాయి. అయితే, గత సీజన్‌లో సీఎస్‌కేను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టార్‌ పేసర్‌, వేలంలో భారీ ధర పలికిన దీపక్‌ చహర్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో ధోని సేనకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

అంతేగాక అత్యధిక పరుగుల వీరుడు, సీఎస్‌కే స్టార్‌ ఓపెనర్‌ రుతురాజ్‌గైక్వాడ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం ఊరట కలిగించినా.. అతడికి జోడీ ఎవరన్నది ఇంకా తేలలేదు. గత సీజన్‌లో రుతుతో కలిసి ఓపెనింగ్‌ చేసిన ఫాఫ్‌ డుప్లెసిస్‌ను వదిలేయగా ఆర్సీబీ వేలంలో అతడిని కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో వీరి స్థానాల్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరన్నా అన్న చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీపక్‌ చహర్‌ను రీప్లేస్‌ చేయగల సత్తా అండర్‌ -19 వరల్డ్‌కప్‌ స్టార్‌ రాజ్‌వర్ధన్‌ హంగర్కర్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఇర్ఫాన్‌ పఠాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘దీపక్‌ చహర్‌ గొప్ప బౌలర్‌. అతడు దూరం కావడం సీఎస్‌కేకు పెద్ద దెబ్బ. నిజానికి శార్దూల్‌ ఠాకూర్‌ కూడా ఇప్పుడు సీఎస్‌కేలో లేడు.

చహర్‌ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాడు హంగర్కర్‌ సేవలను సీఎస్‌కే ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. అతడు ప్రతిభావంతుడు. అయితే, హంగర్కర్‌ చాలా చిన్నవాడు. తనకు అనుభవం తక్కువ. కానీ ధోని వంటి నాయకుడు ఉన్నపుడు ఇలాంటి విషయాలకు భయపడాల్సిన పనిలేదు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఫలితాలు రాబట్టడం, వారిని సౌకర్యంగా మెదిలేలా చేయడంలో ధోని దిట్ట. కాబట్టి హంగర్కర్‌ను చహర్‌ ప్లేస్‌లో జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

అదే విధంగా.. ‘‘ఇక  ఫాఫ్‌ స్థానం విషయంలో సీఎస్‌కేకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే. మరొకరు రాబిన్‌ ఊతప్ప. ఊతప్ప సైతం ఓపెనర్‌గా రాణించగలడనే నమ్మకం ఉంది. అయితే, సీఎస్‌కే వ్యూహం ప్రకారం ఓపెనింగ్‌ జోడీలో కచ్చితంగా ఒక విదేశీ ఓపెనర్‌ ఉండాలనుకుంటే... కాన్వే మంచి ఆప్షన్‌’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్‌ పంత్‌.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top