హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోనే... | Indian team in the fray for the Asian Champions Trophy hockey tournament | Sakshi
Sakshi News home page

హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోనే...

Oct 14 2026 3:40 AM | Updated on Oct 14 2026 3:40 AM

Indian team in the fray for the Asian Champions Trophy hockey tournament

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీ బరిలో భారత జట్టు

ఈనెల 27 నుంచి నవంబర్‌ 5 వరకు జలంధర్, మొహాలీలో టోర్నీ

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరగనున్న ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోనే చాంపియన్స్‌ ట్రోఫీలోనూ టీమిండియా బరిలోకి దిగనుంది. గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైన గోల్‌కీపర్‌ కృషన్‌ బహదూర్‌ పాఠక్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. విష్ణుకాంత్‌ సింగ్, అంగద్‌బీర్‌ సింగ్‌లను రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ నగరాల్లో ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది.

భారత్, దక్షిణ కొరియా, మలేసియా, చైనా, జపాన్, బంగ్లాదేశ్‌ జట్లు ఈ టోర్నీలో పోటీపడతాయి. తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పాకిస్తాన్‌ ఈ టోర్నీలో ఆడటం లేదు. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను 27న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ తర్వాత భారత్‌ 29న చైనాతో... 30న జపాన్‌తో... నవంబర్‌ 1న మలేసియాతో... నవంబర్‌ 2న దక్షిణ కొరియాతో తలపడుతుంది. 

లీగ్‌ దశ ముగిశాక టాప్‌–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌ మొహాలీలో నవంబర్‌ 4న, ఫైనల్‌ మొహాలీలో నవంబర్‌ 5న జరుగుతాయి. సీనియర్‌ ఆటగాళ్లు మన్‌దీప్‌ సింగ్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, అమిత్‌ రోహిదాస్, నీలకంఠ శర్మ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని సమాచారం.

గోల్‌కీపర్లు
సూరజ్‌ కర్కేరా, కృషన్‌ బహదూర్‌ పాఠక్‌. 
డిఫెండర్లు
హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), సంజయ్, అమిత్‌ రోహిదాస్, జుగ్‌రాజ్‌ సింగ్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, అమన్‌దీప్‌ లాక్రా. 
మిడ్‌ఫీల్డర్లు
రాజిందర్‌ సింగ్, ఆదిత్య అర్జున్‌ లలాగే, నీలకంఠ శర్మ, హార్దిక్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్‌. 
ఫార్వర్డ్స్‌
శిలానంద్‌ లాక్రా, అభిషేక్, సుఖ్‌జీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement