Mitchell Santner: మ్యాచ్‌ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు

Ind Vs NZ: Mitchell Santner Gets Best Save Match Award After Save 5 Runs - Sakshi

బ్లాక్‌క్యాప్స్‌ అంటే నాణ్యమైన ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. టి20, పరిమిత ఓవర్లలో వారి ఫీల్డింగ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది టెస్టుల్లో కూడా తమదైన ఫీల్డింగ్‌తో అదరగొట్టారు కివీస్‌ ఆటగాళ్లు. అందుకు మిచెల్‌ సాంట్నర్‌ ఒక నిదర్శనం. అసలే టెస్టు మ్యాచ్‌ల్లో సిక్సర్లు కొట్టడం అరుదు. అలాంటిది అయ్యర్‌ కొట్టిన భారీషాట్‌ను  సాంట్నర్‌ తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆపిన విధానం సూపర్‌ అని చెప్పొచ్చు. భారత్‌తో ముగిసిన రెండో టెస్టులో ఇది చోటుచేసుకుంది. 

ఇక టీమిండియా- కివీస్‌ టెస్టు సిరీస్‌లో మిచెల్‌ సాంట్నర్‌ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. కేవలం సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా మాత్రమే జట్టుకు సేవలందించిన సాంట్నర్‌ అవార్డు గెలుచుకున్నాడు. తన ఫీల్డింగ్‌తో సిక్స్‌ రాకుండా అడ్డుకున్న సాంట్నర్‌ను ''బెస్ట్‌ సేవ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'' కింద రూ.లక్ష ప్రైజ్‌మనీ ఇవ్వడం విశేషం.

చదవండి: Ashwin-Ajaz Patel: ఎజాజ్‌ పటేల్‌కు అశ్విన్‌ సాయం.. ఫ్యాన్స్‌ ఫిదా

టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా ఇన్నింగ్స్‌ 47వ ఓవర్‌లో సోమర్‌ విల్లే బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ లెగ్‌సైడ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. కచ్చితంగా సిక్స్‌ అనుకుంటున్న తరుణంలో సాంట్నర్‌ మ్యాజిక్‌ చేశాడు. బౌండరీలైన్‌ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్న అతను బ్యాలెన్స్‌ చేసుకోవడం కష్టం కావడంతో బంతిని బౌండరీ ఇవతలకు వేయడంతో సిక్స్‌ రాకుండా అడ్డుకున్నాడు. అలా జట్టుకు ఐదు పరుగులు కాపాడిన సాంట్నర్‌ను సహచర ఆటగాళ్లు అభినందించారు.

ఇక రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. అశ్విన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడి గడ్డపై 3 టెస్టులు.. 3 వన్డేలు ఆడనుంది. డిసెంబర్‌ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

చదవండి: Babar Azam: బాబర్‌ అజమ్‌ హాఫ్‌ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top