Eng Vs Zim Test: ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. అతడికి తొలిసారి పిలుపు | England Announce Squad For Zimbabwe Test Sam Cook Handed Maiden Call | Sakshi
Sakshi News home page

జింబాబ్వేతో ఏకైక టెస్టు: ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. అతడికి తొలిసారి పిలుపు

May 2 2025 5:47 PM | Updated on May 2 2025 6:14 PM

England Announce Squad For Zimbabwe Test Sam Cook Handed Maiden Call

‍జింబాబ్వే (England Vs Zimbabwe)తో ఏ​కైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదమూడు మంది సభ్యులతో కూడిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. కాగా.. 27 ఏళ్ల పేసర్‌ సామ్‌ కుక్‌ (Sam Cook)కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కడం విశేషం.

ఇప్పటికే 318 వికెట్లు
కుక్‌తో పాటు జోర్డాన్‌ కాక్స్‌ను కూడా ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన ఇంగ్లిష్‌ జట్టు సెలక్టర్లు.. జోష్‌ టంగ్‌ (Josh Tongue)కు కూడా తిరిగి పిలుపునిచ్చారు. కాగా కౌంటీ క్రికెట్‌లో సామ్‌ కుక్‌  అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.  నిలకడైన ఆటకు మారుపేరైన ఈ ఎస్సె.క్స్‌పేస్‌ బౌలర్‌ కౌంటీల్లో ఇప్పటికే 318 వికెట్లు తీశాడు.

మరోసారి పిలుపు
అదే విధంగా ఇంగ్లండ్‌ లయన్స్‌ తరఫున ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మూడు మ్యాచ్‌లలో కలిపి సామ్‌ కుక్‌ 13 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. జోర్డాన్‌ కాక్స్‌ 2024లోనే అరంగేట్రం చేయాల్సింది. న్యూజిలాండ్‌తో నవంబర్‌ నాటి మ్యాచ్‌లో అతడు ఆడాల్సి ఉండగా.. ప్రాక్టీస్‌ సెషన్‌లో కుడిచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అప్పుడు అవకాశం కోల్పోయిన అతడికి మళ్లీ సెలక్టర్లు పిలుపునిచ్చారు.

ఇక జోష్‌ టంగ్‌ విషయానికొస్తే.. 2023లో ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ టెస్టు తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా స్వదేశంలో జింబాబ్వేతో టెస్టుతో కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తిరిగి ఆటలో అడుగుపెట్టనున్నాడు.

33 ఏళ్ల స్టోక్స్‌ గత కొంతకాలంగా పిక్కల్లో గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన అతడు.. సర్జరీ తర్వాత కోలుకున్నాడు.

కాగా మే 22-25 వరకు సొంతగడ్డపై ఇంగ్లండ్‌ జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. గాయాల కారణంగా మార్క్‌ వుడ్‌, బ్రైడన్‌ కార్స్‌,క్రిస్‌ వోక్స్‌, ఓలీ స్టోన్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఇక జోఫ్రా ఆర్చర్‌ ఇప్పట్లో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు.

జింబాబ్వేతో టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), జోర్డాన్ కాక్స్ (వికెట్‌ కీపర్‌), సామ్ కుక్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్.

చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. అదరగొడతాడు: టీమిండియా మాజీ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement