IPL 2025: అక్ష‌ర్ ప‌టేల్‌కు భారీ షాక్‌.. రూ.12 లక్షల జరిమానా | Axar Patel fined Rs 12 lakh, 6th captain penalised for slow over-rate | Sakshi
Sakshi News home page

IPL 2025: అక్ష‌ర్ ప‌టేల్‌కు భారీ షాక్‌.. రూ.12 లక్షల జరిమానా

Apr 14 2025 6:29 PM | Updated on Apr 14 2025 6:51 PM

Axar Patel fined Rs 12 lakh, 6th captain penalised for slow over-rate

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో  12 ప‌రుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. అయితే ఓట‌మి బాధ‌లో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ పటేల్‌కు భారీ షాక్ త‌గిలింది. అక్ష‌ర్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జ‌రిమానా విధించింది.

ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ జట్టు నిర్ణీ సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సీజన్‌లో తొలిసారి ఢిల్లీ స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేయడంతో... ఐపీఎల్‌ నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్ అయిన అక్ష‌ర్ ప‌టేల్‌పై రూ. 12 లక్షలు జరిమానా విధించారు.

"ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌థి అక్ష‌ర్ ప‌టేల్‌కు జ‌రిమ‌నా విధించాం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం అక్ష‌ర్ కు రూ. 12 లక్షలు జరిమానా విధించాం’’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

ఐపీఎల్ 2025 సీజన్‌లో ‘స్లో ఓవర్ రేట్‌’ కారణంగా జరిమానా ఎదుర్కొన్న ఆరో కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితాలో సంజూ శాంస‌న్‌, రియాన్ ప‌రాగ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, ర‌జత్ పాటిదార్ ఉన్నారు.

కాగా ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(59) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర్యాన్ రికెల్ట‌న్‌(41), సూర్య‌కుమార్‌(40), న‌మాన్ ధీర్‌(38) ప‌రుగుల‌తో రాణించారు. 

ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్, విప్ర‌జ్ నిగ‌మ్‌ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించారు. అనంత‌రం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 19 ఓవర్‌లో వరుసగా మూడు రనౌట్లు అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. 
చ‌ద‌వండి: IPL 2025: రోహిత్ శ‌ర్మ మాస్ట‌ర్ మైండ్‌.. డగౌట్​ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్​మ్యాన్
 

Advertisement
 
Advertisement
Advertisement