గులాబీ జెండా ఎగిరింది ఇక్కడే, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కారే

సమావేశానికి హాజరైన మహిళలు, కార్యకర్తలు - Sakshi

ఇక దేశం కోసం కార్యకర్తలు పనిచేయాలి

నంగునూరు ఆత్మీయ సమ్మేళనంలోమంత్రి హరీశ్‌రావు

నంగునూరు(సిద్దిపేట): "సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లిలో గులాబీజెండా ఎగురవేశారు...అదే సెంటిమెంట్‌తో మొదటగా నంగునూరులో బీఆర్‌ఎస్‌ ఆత్మీయసభ నిర్వహించామని" రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు లింగంగౌడ్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నంగునూరులో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తెచ్చి కేసీఆర్‌ సిద్దిపేట పేరును ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడన్నారు.

మనం లక్ష్యం హస్తిన

నాటి కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో కరెంటుగోస, లంచాలు ఇస్తేనే పని జరిగేదని, నేడు ట్రాన్స్‌ఫార్మర్లు బిస్కెట్లలా పంచుతున్నామన్నారు. తాగునీటికే అల్లాడిన ప్రజలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు, కాళేశ్వరం ద్వారా సాగు నీరందిస్తున్నామన్నారు. నంగునూరు మండలంలో 1,800 ఎకరాల్లో వరిసాగు చేస్తే బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే బీదల, రైతులు, సామాన్యుల పార్టీ అని, అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, గృహలక్ష్మి పథకాలతో పాటు రైతుబీమా, పంట పెట్టుబడి, పెన్షన్‌, పథకాలు ప్రవేశపట్టామన్నారు. సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్‌, పాలిటెక్నిక్‌, పీజీ, వెటర్నరీ, అగ్రికల్చర్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసి మనుషులు, పశువులు, పంటల డాక్టర్ల అడ్డాగా మార్చామన్నారు. తెలంగాణ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డ కార్యకర్తలు ఇక దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌లో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

హరీష్ అంటే పారే నది

రాష్ట్రం వచ్చిన కొత్తలో హరీశన్నను చూస్తే నది వచ్చినట్టు, వాగు పారినట్టు ఉండేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. ఇప్పుడు మెడలో కండువా చూస్తుంటే స్టెతస్కోప్‌లా కనిపిస్తుందని, భుజం మీద చెయ్యి వేస్తే మీ ఆరోగ్యం మా బాధ్యత అన్నట్టుగా ఉందన్నారు. ఉద్యమంలో ప్రజలను జాగృతం చేసేందుకు కవిగా, గాయకుడిగా మారిన నాతోపాటు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, రసమయి బాలకిషన్‌కు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, జెడ్పీటీసీ సభ్యురాలు ఉమ తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మకు మంత్రి జలహారతి

కాళేళ్వరం నీటితో మత్తడి దూకుతున్న పెద్దవాగు వద్ద బుధవారం మంత్రి హరీశ్‌రావు గంగమ్మకు పూజలు చేసి జలహారతి పట్టారు. అనంతరం ఆయకట్టు రైతులతో మాట్లాడారు. ఆతర్వాత నంగునూరులో తెలంగాణతల్లి, బాబు జగ్జీవన్‌రామ్‌, అంబేడ్కర్‌, శివాజీ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పోచమ్మ, ఎల్లమ్మ, మాహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సారయ్య, సోమిరెడ్డి, నాగిరెడ్డి, రాధకిషన్‌శర్మ, రమేశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, పురేందర్‌ పాల్గొన్నారు.

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top