
రైతులకు బిందు సేద్యం పరికరాలను పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట: స్వపరిపాలనలో నిర్మించుకున్న ప్రాజెక్టులతో పుష్కలంగా నీరు అందుతుందని, ప్రతీ గుంటకు నీరు... రైతుల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ.. రైతుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి 800 మంది రైతులను ఉసురు తీసిందని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్య పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ప్రకటిస్తే... బీజేపీ అధ్యక్షుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మరో రూ.10వేలు పరిహారంగా ఇవ్వాలని సవాల్ విసిరారు. యాసంగిలో దేశంలో 97లక్షల ఎకరాల వరి సాగైతే, తెలంగాణలో 56లక్షల ఎకరాల వరి, ఏపీలో 16లక్షల వరి సాగవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనకుంటే తామే కొనుగోలు చేశామని వెల్లడించారు. దేశంలో ఎక్కడ చూసిన తెలంగాణ తరహా పాలన, సంక్షేమ పథకాలు కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌లు పాల్గొన్నారు.
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి
హరీశ్ రావు