మెరుగైన వైద్యసేవలే లక్ష్యం

ఆస్పత్రి ఆవరణను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు - Sakshi

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే ఆగస్టులోపు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రక్త నమూనాల సేకరణ కేంద్రం, ధోభీ ఘాట్‌లను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించి, ఆస్పత్రి ఆవరణాన్ని శుభ్రంగా ఉంచాలని శానిటేషన్‌ సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు మంచి డైట్‌ అందించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో వైద్య సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడాలని ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జనరల్‌ ఆస్పత్రి సుందరీకరణకు రూ.4.17కోట్లు మంజూరయ్యాయని, పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

జీజీహెచ్‌కు మదర్‌ మిల్క్‌ బ్యాంకు

సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి మదర్‌ మిల్క్‌ బ్యాంకు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. అప్పుడే జన్మించిన శిశువుకు తల్లి పాలు ఇచ్చేందుకు మిల్క్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి పాలు పడక ఇబ్బంది పడే వారికి మిల్క్‌ బ్యాంక్‌ దోహాదపడుతుందన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగంలో మరో ఐదు సీట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్‌లో ఓ వాహన డ్రైవర్‌కు అస్వస్థత తలెత్తడంతో ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయించి చికిత్స అందించారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ విమలాథామస్‌, సూపరింటిండెంట్‌ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌, డాక్టర్‌ రాంమోహన్‌, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ హేమలత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టులోపు వెయ్యి పడకల ఆస్పత్రి

ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి

హరీశ్‌రావు

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో

రక్త నమూనాల సేకరణ కేంద్రం,

ధోబీ ఘాట్‌ల ప్రారంభం

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top