
మేరు నగధీరుడు వైఎస్సార్
ఒంగోలు సిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలు జీవితకాలం గుర్తుంచుకోదగ్గ మేరు నగధీరుడు అని ఒంగోలు పార్లమెంట్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. నేడు వైఎస్సార్ 76వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సోమవారం ఆయన పిలుపునిచ్చారు. బత్తుల మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో పేదవాడి గుండెచప్పుడు పసిగట్టిన దార్శనికుడు వైఎస్సార్ అని అన్నారు. వృత్తిపరంగా వైద్యుడైనా ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యాలను గుర్తించి ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ వైద్యం పేదల దరి చేర్చారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో కార్పొరేట్ విద్య, 108 సేవలు ఆయన వల్లే పురుడు పోసుకున్న విషయాన్ని ఆయన రాజకీయ వైరులు సైతం స్వాగతించారన్నారు. నేడు వీధికి ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉన్నారంటే అది నాడు వైఎస్సార్ దార్శనికత వల్లే సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయాన్ని సంస్కరణల బాట పట్టించి 82 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించి అపర భగీరథునిగా వైఎస్సార్ నిలిచారన్నారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందించి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయాన్ని పండగ చేశారని చెప్పారు. విలువలతో కూడిన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రైతు పక్షపాతిగా, రాజకీయాల్లో మాటతప్పని, మడమ తిప్పని నేతగా నిలిచిన వైఎస్సార్ బాటలో నడుస్తున్న ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నంటి ఉండి దివంగత నేతకు నివాళులర్పిద్దామని పిలుపునిచ్చారు.
నేడు మహానేత వైఎస్సార్ జయంతిని జయప్రదం చేద్దాం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
బత్తుల బ్రహ్మానందరెడ్డి