మరికొందరికీ గాలం?

TRS Factions Comments On BJP Over TRS MLA Poaching Case - Sakshi

‘ఎమ్మెల్యేలకు ఎర’లో మరెన్నో అంశాలు ఉన్నాయంటున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు

ఇతర పార్టీల నుంచి చేరిన వారు, అసమ్మతులే టార్గెట్‌

మొత్తం 40 మంది లక్ష్యం.. 15 మంది మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం

రెక్కీ బాధ్యత నందుకుమార్, సింహయాజిలకు అప్పగింత

నమ్మకం కుదిరిన తర్వాతే రంగంలోకి రామచంద్ర భారతి

రోహిత్‌రెడ్డితో సంప్రదింపులు.. చివరి నిమిషంలో గువ్వల, రేగ, హర్షవర్ధన్‌రెడ్డి ఎంట్రీ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని మూడో కంటికి తెలియకుండా ముగించాలని బీజేపీ ప్రయత్నించిందని.. అయితే తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో గుట్టురట్టయిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఫామ్‌హౌజ్‌ వ్యవహారంలో ఉన్న నలుగురేగాకుండా మరికొందరు ఎమ్మెల్యేల ను లక్ష్యంగా ప్రయత్నాలు జరిగాయని, ఆ సమా చారం కూడా తమ వద్ద ఉందని అంటున్నాయి.

ఇందులో బీజేపీ కీలక నేతల ఆదేశాలతోనే ఎమ్మె ల్యేలతో భేటీ తదుపరి కార్యక్రమాన్ని హైదరాబా ద్‌లో కాకుండా ఢిల్లీకి మార్చేందుకు సిద్ధమయ్యా రని వెల్లడిస్తున్నాయి. అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌజ్‌లో జరిగిన సంభాషణల కంటే ముందు జరిగిన సంభాషణల్లో మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయ ని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. గతనెల 26న ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తూ ముగ్గురు వ్యక్తులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా.. అంతకు నెల రోజుల ముందు నుంచే ‘ఎమ్మెల్యేలకు ఎర’ పని కొనసాగిందని గుర్తు చేస్తున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వచ్చేలా చేయడంలో క్రియాశీల పాత్ర పోషించిన తిరుపతికి చెందిన సింహయాజి తెలంగాణలో అదే తరహా ప్రయత్నా లు ప్రారంభించారని.. పార్టీ మారే అవకాశమున్న ఎమ్మెల్యేలను గుర్తించే పనిలో ఆయనకు నందుకుమార్‌ సాయం చేశారని వివరిస్తున్నాయి.

‘ఎర’కు తగిలే వారి కోసం రెక్కీ
తెలంగాణ శాసనసభలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజా రిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదు. అయితే అధికార పార్టీకి చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. కేసీఆర్‌ నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని సింహయాజి, నందుకుమార్‌లకు ఢిల్లీ దూత రామచంద్ర భారతి చెప్పారని, ఈ విషయం వారం క్రితం బయటికొచ్చిన ఆడియో టేప్‌లోనూ ఉందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

2014 తర్వాత వివిధ సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నా మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నాలు చేశారని వివరించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యమున్న 31 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 40మందిని లక్ష్యంగా చేసుకోవాలని భావించారని వెల్లడించారు.

ఈ క్రమంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి తో నందుకుమార్‌ ప్రాథమిక సంప్రదింపులు జరి పారని, తర్వాత సింహయాజి పూర్తిస్థాయిలో టచ్‌ లోకి వచ్చారని తెలిపారు. చేవెళ్ల, పరిగి, కొడంగల్‌ ఎమ్మెల్యేలకూ ఎర వేసేందుకు వారు సిద్ధ మయ్యా రని.. మొత్తంగా పార్టీ మారడంపై సుమారు 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మనోగతాన్ని తెలుసు కునేందుకు ప్రయత్నించారని వివరించారు.

‘గిట్టుబాటు’ కోసమే ఆపరేషన్‌కు సిద్ధం!
కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారడంలో కీలకపాత్ర పోషించిన సింహయాజికి కమిషన్‌ రూపంలో భారీగా గిట్టుబాటు కావడంతో తెలంగాణ ‘ఆపరేషన్‌’కు సిద్ధమయ్యారని ఇంకా వెలుగు చూడని వీడియో, ఆడియో టేపుల్లో ఉన్నట్టు టీఆర్‌ ఎస్‌ వర్గాలు తెలిపాయి. నందుకుమార్‌ కూడా కమిషన్‌తోపాటు నామినేటెడ్‌ పదవి ఆశతో సింహయాజితో చేతులు కలిపారని వివరించాయి.

నందుకుమార్‌కు ఏదైనా పదవి ఇవ్వడంతోపాటు భద్రత కూడా కల్పించాలని ఇంతకుముందే విడు దలైన ఆడియో సంభాషణల్లో ఉన్నట్టు గుర్తు చేశాయి. నందుకుమార్, సింహయాజిల ప్రయ త్నాల్లో పైలట్‌ రోహిత్‌రెడ్డి నుంచి సానుకూల స్పందన రావడంతో.. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి రంగ ప్రవేశం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేశారని వివరించాయి.

కానీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో కీలక మలుపు తిరిగిందని వెల్లడించాయి. కనీసం నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటేనే డీల్‌ సాధ్యమని రామచంద్ర భారతి చెప్పడంతో.. రోహిత్‌రెడ్డికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తోడైన ట్టు తెలిపాయి. రామచంద్ర భారతికి నమ్మకం కలిగించేందుకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలను చివరి నిమిషంలో భాగస్వాములను చేశారని వివరించాయి.

ముగ్గురు నిందితులతో ఫామ్‌హౌజ్‌లో జరిగిన భేటీలో.. రోహిత్‌రెడ్డి చురుగ్గా చర్చల్లో పాల్గొనగా, మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారి నుంచి ప్రభుత్వాల కూల్చివేత, నగదు బదిలీ, ఢిల్లీలో ఎవరు ఆపరేట్‌ చేస్తారన్న అంశాలపై కూపీ లాగే ప్రయత్నం చేశారని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి వ్యూహాత్మకంగా తమకు హిందీ భాష తెలియదంటూ చర్చల్లో మౌనం పాటించినట్టు వివరించాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top