గొప్ప స్నేహితుడు :  రాజ్యసభలో మోదీ కన్నీరు

A tear In PM Eye In Parliament What Made This An Emotional Moment - Sakshi

గులాం న‌బీపై మోదీ ప్రశంసలు, సెల్యూట్‌

సభా ముఖంగా కంట తడిపెట్టిన మోదీ 

సాక్షి న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పదవీ విమరణ చేయనున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్య‌స‌భలో ప‌ద‌వీకాలం ముగుస్తున్న నేత‌ల‌నుద్దేశించి ప్రసంగించిన  మోదీ  కాంగ్రెస్ నేత ఆజాద్‌పై  అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు. గులాం న‌బీ తనకు నిజ‌మైన స్నేహితుడ‌ని అభివర్ణించిన ప్రధాని,  జ‌మ్మూక‌శ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి  సంఘటనలను గుర్తు చేసుకున్నారు.  ఈ సందర్భంగా ఆజాద్‌ సేవలను కొనియాడుతూ  కన్నీరు పెట్టారు. ఉన్నత పదవులు వస్తాయి... పోతాయి కానీ ఆయన స్పందించిన తీరు తలుచుకుంటే కన్నీళ్లు ఆగవంటూ ఆజాద్‌కు సెల్యూట్‌ చేశారు  ఈ సందర్భంగా మోదీ తన దుంఖాన్ని ఆపుకునే ప్ర‌య‌త్నంలో మంచినీళ్లు తాగడం కోసం ఆగడంతో  సభ చప్పట్లో మారుమోగింది.  

ఆజాద్‌ తన సొంత పార్టీ గురించి మాత్రమే కాకుండా దేశం, సభ గురించి కూడా ఆజాద్‌ ఆందోళన చెందే వారన్నారు. 2007లో క‌శ్మీర్‌  ఉగ్ర‌దాడి సమయంలో గుజ‌రాతీ ప‌ర్యాట‌కులు  చిక్కుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో ఆయ‌న చేసిన మేలును మరిచిపోలేనని మోదీ వ్యాఖ్యానించారు. అనుక్ష‌ణం గుజ‌రాతీ ప‌ర్యాట‌కుల‌ను యోగ క్షేమాలపై తనకు అప్‌డేట్ ఇచ్చార‌ంటూ కన్నీరు పెట్టుకున్నారు. సొంత కుటుంబ సభ్యులకన్నా  మిన్నగా స్పందించారంటూ ఆయన స‌హాయానికి సెల్యూట్ చేశారు. గులాం న‌బీ త‌న‌కు చాన్నాళ్ల నుంచి తెలుసు అని, ఒకే సారి సీఎంలుగా పనిచేశామ‌ని, గార్డెనింగ్‌లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంద‌న్నారు. అలాగే ఆ సమయంలో దివంగత‌ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్రయత్నాలను కూడా తాను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ‘మీ పదవీ విరమణను  అంగీకరించను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి’  అని ఈ ఫిబ్రవరి 15 తో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఆజాద్ నుద్దేశించి మోదీ అన్నారు. గులాం నబీ జీ ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతారు. ఎప్పుడూ అసభ్యకరమైన భాషను ఉపయోగించరు. ఈ విషయంలో ఆయన్నుంచి నేర్చుకోవాలన్నారు. అలాగే కశ్మీర్‌ ఎన్నికలను ఆజాద్‌ స్వాగతించారంటూనే కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

మరోవైపు దీనిపై ఆజాద్‌ స్పందిస్తూ పార్టీ పరంగా విభేదాలున్నా..పలు విషయాలపై ఇరువురం పరస్పరం వాదించుకున్నా, విమర్శించుకున్నా, వ్యక్తిగత సంబంధాలను  దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. పండుగల సందర్భంగా తప్పనిసరిగా పలకరించే వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీ ఉంటారని గుర్తు చేసుకున్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top