
విద్యుత్ తీగలు తగిలి మూడు మేకల మృతి
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి మూడుమేకలు మృతిచెందాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనపై మేకల యజమానులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బడ్నాన సోములు, పెరుమాల అప్పారావు, తోకల చిన్నమ్మతల్లి వారి మేకలను పొలాల్లోకి మేతకు తోలారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల అదే గ్రామానికి చెందిన సిరిపురం రమణ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం తీగలు తెగి కిందపడ్డాయి. ఆ పొలంలోకి మేతకు వెళ్లిన మేకలు కిందపడి ఉన్న తీగలకు తగిలి షాక్‌కు గురై గిలగిల కొట్టుకుంటూ మృతిచెందాయి. మేకల యజమానులు పరిగెత్తి వెళ్లి చూశారు. విద్యుత్ తీగల కింద పడి మేకలు ఉండడంతో ముట్టుకోకుండా వెనక్కు జంకారు. దీంతో పెనుప్రమాదమే తప్పింది. మృతి చెందిన మేకలను చూసి యజమానులు భోరున విలపించారు.
గుంతలో పడి 30 గొర్రెలు..
వేపాడ: మండలంలో రామస్వామిపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులకు చెందిన 30 గొర్రెలు ప్రమాదవశాత్తు గుంతలో జారిపడి మృతిచెందడంతో వాటి యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం గ్రామానికి చెందిన పత్రి బాలకృష్ణ, రామారావులకు సంబంధించిన గొర్రెల మందను మేత కోసం తోలారు. గ్రామసమీపంలో ఊరమెట్ట వద్ద వాటిని మేపి కిందికి దిగుతుండగా అక్కడే ఉన్న పెద్ద గుంతలో 30 గొర్రెలు జారిపడి చనిపోయాయి. ఈ సమాచారం గ్రామంలో తెలియగానే సర్పంచ్ వడ్లమాని శర్మ, పశువైద్యాధికారి అనిల్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. సుమారు రూ.నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
విద్యుత్ స్తంభం పడి మూడు మూగజీవాలు..
శృంగవరపుకోట: ఎస్.కోట పరిధిలోని కాపు వారి కళ్లాల వద్ద కరెంట్ స్తంభం కూలి ఒక చూడి గేదె, పాడిగేదె, గేదెపెయ్యి ప్రాణాలు వదిలాయి. ముందుగా స్తంభం కూలి పెయ్యిపై పడి చనిపోగా, పక్కనే ఉన్న గేదెలపై విద్యుత్ తీగలు పడడంతో విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందాయి. దీంతో బాధితుడు వేమలి వెంకటరమణ, కుటుంబసభ్యులు వాటి వద్ద గుండెలు బాదుకుని రోదించారు. రూ.3లక్షలు విలువ చేసే పశువులు చనిపోయాయని వాపోయారు. కాగా ఈ ఘటనపై విద్యుత్‌శాఖ అధికారులు నోరు మెదపక పోవడం శోచనీయం.

విద్యుత్ తీగలు తగిలి మూడు మేకల మృతి

విద్యుత్ తీగలు తగిలి మూడు మేకల మృతి

విద్యుత్ తీగలు తగిలి మూడు మేకల మృతి