
పనుల పూర్తికి ఆరుమాసాల గడువు
● ఇంజినీర్లను ఆదేశించిన కలెక్టర్
ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్, జలవనరులు, ప్రజా ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, ఏపీ ఎంఎస్‌ఐడీసీ, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ఏపీ టిడ్కో, గృహ నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టిన పనులన్నీ ఆరు మాసాల్లోగా పూర్తికావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సిద్ధం చేసి శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొన్నారు. నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీచేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జన్‌మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ
సమావేశంలో కల్టెర్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ పీఎం జన్‌మన్ కార్యక్రమం కింద చేపట్టిన రహదారుల పనులను వేగవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన పీఎం జన్‌మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇకపై ప్రతిరోజూ, ప్రతివారం, ప్రతి మాసం సాధించిన ప్రగతి వివరాలను తనకు సమర్పించాలని, ఆగస్టు 15 నాటికి పనులు పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభించి కొనసాగుతున్న పల్లె పండుగ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని తేల్చిచెప్పారు. అలాగే శతశాతం పనులు పూర్తయి ప్రారంభం కాని గ్రామ సచివాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర కట్టడాలను శాసనసభ్యుల ద్వారా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజక వర్గంలో అవసరమైన పనులను గుర్తించి, వాటి జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అటువంటి వాటిని ఆయా నియోజక వర్గ శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదిస్తే, వాటికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో పూర్తయిన గృహాలను, అదేవిధంగా లేఅవుట్స్‌లో పూర్తయిన గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ఉపకలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ డా.ఎస్.భాస్కరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీఓ టి.కొండలరావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి ఒ.ప్రభాకరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.