తూకం... మోసం.. ! | - | Sakshi
Sakshi News home page

తూకం... మోసం.. !

Nov 28 2025 9:01 AM | Updated on Nov 28 2025 9:01 AM

తూకం.

తూకం... మోసం.. !

కాటాలతో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులు

ప్రజలను బురిడీ కొట్టించి దోపిడీ

అధికారుల తూతూ మంత్రపు జరిమానాలు

ఇప్పటికై నా అరికట్టాలని ప్రజల వేడుకోలు

జీరో సరిగా చూడండి.. రెండు కిలోలు సరిపోయింది చూడండి.. అని ఎంతో శ్రద్ధగా చెబుతుంటే సంతోషంగా జేబులో డబ్బులు తీసి ఇస్తాం. రెండు కిలోల సంచి బరువు తక్కువగా అనిపించినా, కళ్లతో చూశాం కదా.. నిజమేనని మనకు మనమే సర్దుకుని వెళతాం. అయితే ఆ నిజాయతీ మాటల వెనుక ఉన్న మోసం.. కళ్లను మాయ చేసే తూకం తెలిస్తే మైకం కమ్ముతుంది. తక్కెడలో మోసాలను అరికట్టడంతో అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత కళ్ల ముందు కదలాడతాయి.

నరసరావుపేట టౌన్‌: వంట గదిలో ఉప్పు, పప్పు, కూరగాయలు ఇలా ఏ సరుకులు కావాలన్నా పక్కనే ఉన్న చిల్లర దుకాణం నుంచి లేదా పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో కొనుగోలు చేస్తుంటాం. కొందరు పావు కిలో, కిలో ఇలా స్థోమత మేరకు సరుకులు తెచ్చుకుంటారు. ఇంకాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఒకేసారి నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేస్తారు. ఇలా ప్రతి నెలా మధ్య తరగతి కుటుంబానికి సుమారు రూ.3 వేలు నుంచి రూ.5 వేలు ఖర్చవుతుంది. అయితే ఇలా మనం తెచ్చుకునే సరుకుల కొలత కళ్లతో చూసిందే నిజం అని నమ్ముతుంటాం. కానీ మన కళ్లను ఏమార్చి తూకాన్ని మార్చి జేబులు గుల్ల చేస్తున్నారు.

5 కిలోల సరుకు 7.50 కిలోలట..

నరసరావుపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారి జె. సాయి శ్రీకర్‌ గత ఆదివారం స్థానిక చేపల మార్కెట్‌ను తనిఖీ చేశారు. అక్కడ ఐదు కేజీల చేపలు తూకం వేస్తే 7.50 కేజీలు చూపించాయి. దీంతో వచ్చిన అధికారులతోపాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. మార్కెట్‌ మొత్తం తనిఖీ చేసిన అధికారులు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. దీంతో వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించి అధికారులు చేతులు దులుపుకున్నారు.

నిలువు దోపిడీ..

ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు మార్కెట్‌కు క్యూ కడతారు. అక్కడ రద్దీ కారణంగా త్వరగా ఇంటికి వెళ్లేందుకు తొందర పడుతుంటారు. ఇదే అదనుగా మార్కెట్‌లో వ్యాపారులు.. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క ఆదివారమే మార్కెట్‌లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎలక్ట్రికల్‌ కాటాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతికతలో లోపాలను గుర్తించిన వ్యాపారులు తూకంలో దగా చేస్తున్నారు. కేజీకి సుమారు 200 నుంచి 250 గ్రాముల వరకు వ్యత్యాసం ఉండేలా ఎలక్ట్రికల్‌ కాటాలో అమర్చుతున్నారు. కాటా పెట్టే సమయంలో జీరో చూపించటంతో వినియోగదారులు తూకం విషయంలో అనుమానించటం లేదు. తీరా కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిన తర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

జరిమానాతో ఆగేనా ?

నరసరావుపేటలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీ చేసినప్పుడు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని తెలిసినా అధికారులు మాత్రం తూతూమంత్రం జరిమానాలతో సరిపెట్టారు. అసలు ఈ జరినామాతో అక్రమ వ్యాపారుల్లో మార్పు వస్తుందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయవచ్చు. అక్రమాలకు పాల్పడినవారిని నిందితులుగా గుర్తించి న్యాయస్థానాల్లో నిలబెట్టవచ్చు. వారిపై నేరం రుజువైతే శిక్షలు పడే అవకాశం కూడా లేకపోలేదు. ఈ పరిణామాలతో అక్రమార్కుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కళ్లముందు తూకంలో మోసం గుర్తించినా అధికారులు మాత్రం కేవలం జరిమానాలతో సరిపెట్టడం వినియోగదారులను ఆగ్రహానికి గురిచేస్తుంది.

తూకం... మోసం.. ! 1
1/1

తూకం... మోసం.. !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement