
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి
చిలకలూరిపేట: విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ పిలుపు నిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపు నిచ్చిన టీడీపీ ఇప్పుడు అదాని మేలు కోసం స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంతో పాటు సర్దుబాటు చార్జీల విధానాన్ని తొలగించాలని కోరారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలందరిపై భారం పెరుగుతుందని, ముందుగానే డబ్బు చెల్లించి రీచార్జి చేయించుకున్నా, బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సహాయ కార్యదర్శి బొంతా దానియేలు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్