
భూ వివాదం బంధాల మధ్య చిచ్చురేపింది
● సోదరుల మధ్య ఘర్షణ ● ఆస్పత్రి పాలైన తమ్ముడు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లెలు
యడ్లపాడు: భూ వివాదం రక్తసంబంధాలను దాటుకుని దాడికి పురిగొల్పింది. ఫలితంగా అన్మదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు తీవ్రంగా గాయపడగా, చెల్లెలు అన్నపై ఫిర్యాదు చేసిన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎలుకా సాంబయ్య, వీరమ్మ దంపతులకు వెంకటరావు, వీరాంజనేయులు, వెంకమ్మ ముగ్గురు సంతానం. తండ్రి మోకాళ్ల నొప్పులతో నడవలేని పరిస్థితి, తల్లికి పక్షవాతం కారణంగా కుమార్తె వెంకమ్మ ఆదరణలో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల వీరాంజనేయులు భార్య కాలం చేయడంతో అతని కుమార్తెను ఆమె చూసుకుంటుంది. తల్లి వీరమ్మ పేరిట రెండు ఎకరాల పొలం ఉంది. కొద్దిరోజులుగా అందులో సగం తనకు పంపిణీ చేయాలంటూ పెద్ద కుమారుడు వెంకటరావు కుటుంబ సభ్యుల్ని కోరగా, అలా సాధ్యం కాదని మిగిలిన ఇద్దరు అడ్డు చెప్పడంతో వివాదం మొదలైంది.
దీంతో ఈనెల 22వ తేదీన అన్నదమ్ముల మధ్య గొడవ రాజుకుంది. ఆగ్రహావేశంతో అన్న తమ్ముడి తలపై రోకలి బండతో మోదాడు. దీంతో తీవ్రగాయాలైన తమ్ముడిని కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం బాధితుడి సోదరి వెంకమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.