ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌ | - | Sakshi
Sakshi News home page

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌

Jun 30 2025 3:50 AM | Updated on Jun 30 2025 3:50 AM

ఏకాంత

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌

భువనేశ్వర్‌: రథాలపై ఏకాంత సేవకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, ఈ మేరకు భక్తులకు ముందస్తు సమాచారం జారీ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని సీనియర్‌ సేవాయత్‌, శ్రీ మందిరం మాజీ పాలక మండలి సభ్యుడు రామచంద్ర దాస్‌ మహా పాత్రో విచారం వ్యక్తం చేశారు. ఏకాంత సేవకు సంబంధించి భక్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని, కానీ అది జరగలేదని తెలిపారు. భక్తులకు కనీస సమాచారం అందజేసేందుకు అనుబంధ కేంద్రంలో ఏ ఒక్కరు అందుబాటులో లేరని ఆరోపించారు.

పాము కాటుతో ఇద్దరికి అస్వస్థత

రాయగడ: రెండు వేర్వేరు ఘటనల్లో పాముకాట్లకు గురై ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ సమితి పర్శాలి పంచాయతీలోని నిరుగుండి గ్రామానికి చెందిన తటక టక్రి భార్య సస్మిత కల్యాణసింగుపూర్‌లో రథయాత్రను చూసేందుకు శనివారం వెళ్లారు. అదే గ్రామంలో గల తన కన్నవారింట్లో రాత్రి ఉండిపోయింది. ఆదివారం తెల్లవారున కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలో గల నది వద్దకు వెళ్లింది. అదే సమయంలో పాము ఆమెను కాటు వేసింది. ఇంటికి వచ్చి తమ కుటుంబీకులతో విషయాన్ని చెప్పింది. వెంటనే ఆమెను కల్యాణసింగుపూర్‌ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్పించారు. చికిత్సను అందించిన వైద్యులు పాముకాటుకు గురైన మహిళ ఆరోగ్యం కుదుటుగా ఉందని చెప్పారు. కళ్యాణసింగుపూర్‌ సమితి పరిధిలో గల సెరిగుమ్మ పంచాయతీలోని మండాపుట్‌ గ్రామానికి చెందిన నచిక రఘు అనే వ్యక్తికి పాము కాటు వేసింది. కళ్యాణసింగుపూర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

ముఖ్యమంత్రి కొత్త ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శాశ్వత్‌ మిశ్రా

భువనేశ్వర్‌: 1996 సంవత్సరపు ఐఏఎస్‌ బ్యాచ్‌ అభ్యర్థి శాస్వత్‌ మిశ్రా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. మరో వైపు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ వినీత్‌ అగర్వాల్‌ని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ఆఫీసరు ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా, పూరీ జిల్లా కలెక్టరు సిద్ధార్థ శంకర స్వంయిని సాధారణ పాలన విభాగం ఆఫీసరు ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా బదిలీ చేశారు.

చోరీ కేసులో ముగ్గురు అరెస్టు

రాయగడ: సదరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల బాలాజీ మెడికల్‌ స్టోర్స్‌లో ఇటీవల జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బి.హేమంత్‌ కుమార్‌, షేక్‌ బాష, బి.వెంకటేష్‌ ఉన్నారు. వారి నుంచి రూ.15,580 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన అర్ధ రాత్రి ప్రధాన రహదారి వద్ద గల బాలాజీ మెడికల్‌ స్టోర్స్‌లో చోరీ జరిగింది. దుకాణం షట్టర్‌ను గ్యాస్‌ పైపులతో కట్‌ చేసి దుండగులు లోపలకు చొరబడి క్యాస్‌ కౌంటర్‌లో గల సుమారు 12 వేల రుపాయల నగదును చోరీ చేసినట్లు బాధితుడు చిన్నారి సురేష్‌ కుమార్‌ సదరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి శనివారం కోర్టుకు తరలించారు.

రథం లేని రథయాత్ర

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా చందాహండి సమితి పట్కి గ్రామ పంచాయతీలో జరిగిన రథయాత్ర విమర్శలకు దారి తీసింది. ఇక్కడ పాత రథం పాడైపోవడంతో గిరిజనులు కొత్త రథం నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అందుకు అవసరమైన కలప 10 ట్రాక్టర్ల ద్వారా తెస్తుండగా ఈ ఏడాది మార్చి 30న అధికారులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేనందున సీజ్‌ చేశారు. దేవాలయ కమిటీ విజ్ఞప్తితో ఉచితం సేవకి వచ్చిన ట్రాక్టర్లు కూడా సీజ్‌ అయ్యాయి. నేటికీ వాటిని వదలకపోవడంతో అందరికీ ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో గిరిజనులు రథం లేకుండా రథయాత్ర చేశారు.

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌ 1
1/3

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌ 2
2/3

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌ 3
3/3

ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement